
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాగృతి పత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు పాల్గొని ప్రసంగించారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన ఎంతో కాలం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు దక్కాల్సిన గౌరవం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన 1968వ సంవత్సరంలో వియాత్నం మహిళా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన మహిళా మంత్రికి అధికారులు పలు పర్యటక కేంద్రాలను చూపించగా, ఆమె వాటన్నింటిని తిలకించి అనంతరం శివాజీ మహారాజ్‌కు పూలమాల సమర్పించాలని ఉందని, కావున ఆ విగ్రహం వద్దకు తీసుకెళ్లమని కోరారు. దీంతో అధికారులు ఎంతగానో శ్రమించి, మహారాష్ట్ర వారు నడుపుతున్న ఓ పాఠశాలలో శివాజీ స్మారకం ఉందని తెలుసుకొని అక్కడకు వియాత్నం మహిళా మంత్రిని తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం, శివాజీ స్మారక సందర్శనం కోసం మీరు ఎందుకు ఇంత పట్టుబట్టారని ఆ వియాత్నం మహిళా మంత్రిని అడుగగా, అందుకు ఆమె, ఈ దేశం అంతా మొఘలుల చేతిలోకి వెళ్లిపోయిందని అనుకున్నప్పుడు, “ఎవరి అండ లేకుండా ఒంటరిగా శివాజీ నిలబడి ఒక రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. ఆయన ప్రేరణతోనే తాము అమెరికాతో యుద్ధం చేయగలుతున్నా”మని వివరించడం జరిగిందని, వడ్డి విజయసారథి గారు తెలిపారు.
శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడై 300 ఏళ్లు పూర్తైన సందర్భంలో అఖిల భారతీయ స్థాయిలో కమిటీ ఏర్పడి పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వడ్డి విజయసారథి గారు గుర్తు చేసుకున్నారు. శివాజీ మహారాజ్ తపస్సు చేసి భ్రమరాంబా దేవి ఆశీస్సులు పొందిన శ్రీశైలంలో శివాజీ మందిరం నిర్మాణం చేయాలని అనంతపురం విభాగ్ ప్రచారక్ రామ్మోహనరావుగారు తలపోసి, ఆ దిశగా ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే 1974లో ఓ కమిటీ ఏర్పడి శివాజీ మహారాజ్ స్మృత్యర్థం భవ్యమైన మందిరం రూపకల్పనకు నడుం బిగించిందన్నారు. ఒక పని ప్రారంభించి ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకుండా పాటుపడే విషయంలో శ్రీ రామ్మోహనరావుగారు ఆదర్శమని ఈ సందర్భంగా వడ్డి విజయసారథిగారు తెలిపారు.
రామ్మోహనరావుగారితో తనకు 1970లో పరిచయం ఏర్పడిందని, ఆయన ఎల్లప్పుడు తన వద్ద రెండు మూడు పుస్తకాలను ఉంచుకునేవారని, సమయం చిక్కినప్పుడల్లా పుస్తక పఠనం చేసేవారని విజయసారథిగారు గుర్తు చేసుకున్నారు. రామ్మోహనరావుగారు చదివింది పాలిటెక్నిక్ అయనా చరిత్ర పట్ల ఆయనకు మమకారం ఎక్కువగా ఉండేదన్నారు. రామ్మోహనరావుగారి కార్యప్రణాళికతోనే ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉండి కూడా బి. సూర్యప్రకాశ్ రెడ్డి నాటి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. ఈ ఘటన రామ్మోహనరావుగారి వ్యూహ రచన, శ్రమశక్తికి నిదర్శనం అన్నారు. అలాగే, ఎమర్జెన్సీ అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క స్థానంలో గెలవగా అది నంద్యాల కావడం విశేషం అన్నారు. ఈ విజయానికి కారణం రామ్మోహనరావుగారేనని స్పష్టం చేశారు.
రామ్మోహనరావుగారు జాగృతి సంపాదకులుగా తనదైన ముద్ర వేసుకున్నారని వడ్డి విజయసారధిగారు తెలిపారు. జాగృతి పత్రికకు రాయడం గర్వకారణమనే రీతిలో ప్రముఖ రచయితలు భావించే స్థాయికి పత్రికను తీసుకెళ్లారన్నారు. అప్పటివరకు చదవడమే తప్ప రాయడం తెలియని రామ్మోహనరావుగారు జాగృతి పత్రికకు మరింత వన్నె తేవడం ఆయన నిర్మాణ కుశలతకు నిదర్శనమని వివరించారు. 1990ల కాలంలో త్రిపురనేని హనుమాన్ చౌదరిగారు నేటి రాజకీయం పేరిట, దర్పణం పేరిట వాకాటి పాండురంగారావుగారు కాలమ్స్ రాసేవారిని, కమ్యునిస్టు నేపథ్యం ఉన్న ప్రముఖ కథానికులు పి. చంద్రశేఖర్ ఆజాద్ సైతం జాగృతికి కథ రాసేందుకు ఇష్టపడేవారని తెలిపారు. జాగృతికి కథ రాయడం అంటే ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంటుందని చంద్రశేఖర్ ఆజాద్ అనేవారని వడ్డి విజయసారథి గారు గుర్తు చేసుకున్నారు. కథ ప్రచురణ కావడం గర్వకారణంగా రచయితలు భావించే స్థాయికి జాగృతిని తీసుకెళ్లిన ఘనత రామ్మోహనరావుగారికి దక్కుతుందన్నారు.
రామ్మోహనరావుగారికి కీర్తి కంటే పనిపైగా ఎక్కువ దృష్టి ఉండేదని విజయసారథిగారు తెలిపారు. అందుకే సుదీర్ఘ కాలం సంపాదకునిగా ఉన్నప్పటికీ ఆయన పేరిట వ్యాసం వెలువడేది కాదన్నారు. అయితే, దీపావళి సంచికలో మాత్రం తప్పకుండా ఆయన ముద్ర ఉండేదని తెలిపారు. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో మక్కువ అని తెలిపారు. పంచెకట్టులో ఉన్నప్పటికీ ఫోటోలు తీసేందుకు అవసరమైతే ఒంటిగోడలను సైతం ఎక్కేవారని తెలిపారు.
పనికి ముందు ఉండి పేరుకి వెనుక ఉండడం ఎట్లా అనేది రామ్మోహనరావుగారి వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకోవచ్చునని విజయసారథిగారు తెలిపారు. రామ్మోహనరావుగారు ఏ పని తలపెట్టినా అందుకు కావాల్సిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని కార్యసాధనలో నిమగ్నం అయ్యేవారిని తెలిపారు. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరిట ఆయన స్మారక చిహ్నంగా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు అయిందంటే అందులో రామ్మోహనరావుగారి శ్రమ ఎంతో ఉందన్నారు. ప్రస్తుత జాగృతి భవన నిర్మాణంలోనూ రామ్మోహనరావుగారు కీలక పాత్ర పోషించారన్నారు. వివేకానంద స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించి శ్రీ ఏకనాథ్ రనాడే గారు ఏ విధంగా అయితే యావత్ భారతదేశంలో వివేకానంద స్ఫూర్తిని నింపారో అదే విధంగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించి భారతీయ ప్రజల్లో శివాజీ స్ఫూర్తిని నింపేందుకు రామ్మోహనరావుగారు కృషి చేశారని కొమరవీరు కృష్ణమోహనరావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసారథి గారు సభికులకు తెలియజేశారు. సంతులనం, సమన్వయం, నలుగురిని కూడగట్టి ముందుకు సాగే సౌమ్యత ఉండి పరిణతి చెందిన కార్యకర్త మనల్ని వదిలిపెట్టి వెళ్లడం దురదృష్టకరమని, చరిత్రను మలుపు తిప్పాల్సిన ఈ సమయంలో మరెందరో రామ్మోహనరావులు అవసరమైన సమయమిది అని ఆయన నిష్క్రమణ సమయంలో జాగృతి పూర్వ సంపాదకులు తూములూరి లక్ష్మీనారాయణగారు రాసుకొచ్చిన విషయాన్ని వడ్డి విజయసారథి గారు మరొక్కసారి గుర్తుకు తెచ్చారు.





