News

మెల్ బోర్న్‌లో బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా హిందువుల ర్యాలీ

210views

బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా క్రూర హింసకు పాల్పడుతున్న ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హిందువులపై అఘాయిత్యాలు ఆపేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మెల్ బోర్న్‌లోని హిందువులు కూడా బంగ్లాదేశ్ పరిణామాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందువులపై జరుగుతున్న దురాగతాలను నిరసిస్తూ మెల్ బోర్న్‌లో హిందువులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో సాయంత్రం 4 గంటలకు ‘ఆస్ట్రేలియన్ హిందూ కమ్యూనిటీ’ బ్యానర్‌పై నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న హింసను వెంటనే ఆపేయాలని, చిన్మయ్ ప్రభును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని వీరు కోరారు.
మరోవైపు ఈ నిరసన అంతా శాంతియుతంగానే సాగింది. హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, హిందువుల ఆవేదనను వక్తలు కళ్లకు కట్టినట్లుగా వివరించారు. బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించడం వెనుక వున్న హిందువుల ధైర్యం అమోఘమని పరాగ్ గైక్వాడ్ పేర్కొన్నారు. మానవ హక్కుల సంఘాలు హిందువుల పట్ల అత్యంత ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులను కనికరం లేకుండా వీధుల్లో కొట్టడం మరియు హిందూ మేధావులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోందని సౌరభ్ కుమార్ హిందువులను ఛాందసులు బాధపెట్టిన విధానాన్ని వివరించారు. మరోవైపు అదితి పాఠక్ మాట్లాడుతూ… హిందూ ధర్మం గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే చెప్పాలని తెలిపారు. దీని ద్వారా ధైర్యాన్ని నింపినట్లు అవుతుందని, అలాగే హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు కూడా అర్థమవుతాయని వివరించారు.