
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే.. దీనిపై ఆయనే స్వయంగా స్పందించారు. ఈ వార్తను ఖండించారు. తనను కేంద్రంగా చేసుకొని, కొందరు తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఆత్మగౌరవం విషయంలో రాజీపడనని, అయితే… జరగని వార్తలను జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను గర్భగుడిలోకి రాకుండా అడ్డుకున్నారన్న వదంతులను మాత్రం ఎవ్వరూ నమ్మవద్దని కోరారు.ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. జరగని దానిని జరిగినట్లు కొన్ని హిందూ ధర్మ వ్యతిరేకులు ప్రచారం లేపారు. ఇళయ రాజాను అవమానించారని, అడ్డుకున్నారంటూ ఓ పెద్ద ప్రచారమే చేశారు.
జరిగింది ఏమిటంటే..
శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్ర సాయి గోదాదేవి ఆలయం వుంది. ధనుర్మాసం మొదటి రోజు కావడంతో అక్కడికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వెళ్లారు. అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా కూడా వెళ్లారు. ఇళయ రాజా కారు దిగగానే… ఆలయ నిర్వాహకులు పూల మాల వేసి, సాదరంగా స్వాగతం పలికారు. ఇళయ రాజా దేవాలయంలోకి ప్రవేశించే వరకూ చిన్నజీయర్ వారు కూడా వారితోనే వున్నారు. దీనికి సంబంధించినది వీడియోలో స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. అయితే… ఇళయరాజా, చిన్నజీయర్ స్వామీజీ ఇద్దరూ గర్భగుడి వరకూ సమానంగా నడుచుకుంటూనే వెళ్లారు.
అయితే ఆలయ ధర్మశాస్త్రం ప్రకారం గర్భాలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం వుండదు. అర్చకులు, వైష్ణవ సన్యాసులు (జీయర్లు)కు మాత్రమే అనుమతి వుంటుంది. ఈ ఆచారం అందరికీ బాగా తెలుసు.అయితే.. చిన్నజీయర్ స్వామిజీతో మాట్లాడుతూ… ఏమరుపాటులో ఇళయ రాజా కూడా గర్భగుడిలోకి వెళ్లిపోతుంటే… అర్చకులు… ఇది గర్భాలయం అని, క్షణం ఆగండి అని ఇళయ రాజాను సంప్రదాయం ప్రకారం ఆపారు. చిన్నజీయర్ స్వామిజీ సంప్రదాయం ప్రకారం గర్భాలయంలోకి వెళ్లారు.
ఆ తర్వాత అర్చకులు చిన్నజీయర్ స్వామి వారితో పాటు ఇళయ రాజాకి కూడా తీర్థం ఇచ్చి, పరివట్టము (స్వామి వారి శేషవస్త్రం) కట్టారు.అలాగే నిర్మాల్యం పూల మాల కూడా ఇళయ రాజాకి వేశారు. తీర్థప్రసాదాలు కూడా ఇచ్చారు. చివరగా మళ్లీ ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి వారు ఇళయ రాజానికి పక్కనే కూర్చొబెట్టుకొన్నారు. జరిగింది ఇదీ… కానీ హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా చేసిన ప్రచారం వేరు.





