News

కృష్ణవేణి సంగీత నీరాజనం

239views

భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు… ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం సాంస్కృతిక వైభవంతో సాగింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందని, ఈ సంగీత విందును ఆస్వాదించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులు విదుషి.మండ సుధారాణి బృందం గాత్ర కచేరి (కర్ణాటక శాస్త్రీయ సంగీతం), వయోలిన్-డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ , మృదంగం ఎం శ్రీధర్, ఘటం-మావుడూరు సూర్యప్రసాద్ రావు తదితరులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వాతాపి గణపతిం..ఎందరో మహాను భావులు.. వంటి కీర్తనలు ఆహుతులను అలరించాయి.

ఈ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ తరపున చందర్ నాయక్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, అరసవల్లి దేవస్థానము డిప్యూటీ కమిషనర్ వై భద్రాజి, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.