
తిరుమల క్షేత్రం తరహాలో శ్రీశైల మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన చాంబర్‌లో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మహా క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన దేవదాయ, పర్యాటక, ఆర్‌అండ్‌బీ మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారన్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను అందజేయాలన్నారు. రాబోయే రెండేళ్లలో శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల క్షేత్ర తరహాలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో నివేదికలు తయారు చేసి ఇస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గతంలో దేవదాయ, అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలన్నారు.
భారత ప్రభుత్వం నిర్దేశించిన అటవీ విస్తీర్ణం, అటవీ సరిహద్దుల సర్వే, గెజిట్ నోటిఫికేషన్, నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల నిషేధిత భూములు సంబంధిత వివరాలతో నివేదికలు అందజేయాలన్నారు. శ్రీశైల దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ సరిహద్దుల నుంచి రక్షణ గోడలు, తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన నివేదికలను అందజేయాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ ఆజాద్‌కు సూచించారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి గతంలో మంత్రుల కమిటీ సూచించిన అంశాలు, తయారు చేసిన నివేదికలను కూడా అందజేయాలన్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు ప్రతిపాదనలు, రహదారి విస్తరణ పనులు మాస్టర్ ప్లాన్ నివేదికలో పొందుపరుస్తామన్నారు.





