News

లంకమలలో పురాతన శిల్ప రేఖాచిత్రాలు

148views

వైయస్సార్ జిల్లాలోని లంకమల అభయారణ్యం అత్యంత విశిష్టమైంది. ఆరంభం నుంచి మానవ మనుగడకు మూలాధారంగా విరాజిల్లుతోంది. క్రీ.పూ. కొండలపై చిత్రీకరించిన పలు రకాల శిల్ప రేఖా చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వేలాది సంవత్సరాలుగా ఇవి చెక్కుచెదరకుండా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సిద్దవటం లంకమల అభయారణ్యంలోని సిద్దవటం, మద్దూరు, కొండూరు, రోలబోడు అడవుల్లోని కొండలపై ఉన్న ఈ పురాతనమైన చిత్రాలను సిద్దవటం అటవీక్షేత్రాధికారిణి కళావతి గుర్తించారు. వీటిలో మానవాకృతులు, జంతువులు, పక్షులు, దేవతామూర్తులు, సర్పాలు తదితర చిత్రాలున్నాయి. కొన్ని స్పష్టంగా లేక అడ్డదిడ్డంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని అద్భుతమైన నైపుణ్యంతో చిత్రీకరించినట్లుగా ఉన్నాయి. ఈ విషయమై కళావతి మాట్లాడుతూ అటవీ సంరక్షణలో భాగంగా లంకమల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా కొండలపై చిత్ర, విచిత్రమైన శిల్ప చిత్రాలు కనిపించడంతోపాటు వాటిని ఫొటోలు తీశామన్నారు. అవి ఆదిమానవులు చెక్కినవా లేదా రాజుల పరిపాలనలో కళాకారులు గీసినవా అనేది తెలియాల్సి ఉందని వివరించారు. వీటి సంరక్షణ, అభివృద్ధికి అటవీశాఖ నిర్వహణ ప్రణాళిక కింద చేర్చాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదించామని తెలిపారు.