
భగవంతుడు కొలువై ఉన్న అంతర్వేది పుణ్యక్షేత్ర పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతీ మహాస్వామి భక్తులకు హితవు పలికారు. అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనృసింహుని దర్శనానికి విచ్చేసిన భారతీ మహాస్వామికి అర్చకులు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనృసింహస్వామికి విశేష అర్చన, ఉపాలయంలోని రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి భారతీ మహాస్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దివ్య క్షేత్రంలో భగవంతుడికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యప్రదమైందన్నారు. భగవంతుడి పట్ల శ్రద్ధాభక్తి, విశ్వాసం ఉంచాలన్నారు. భగవత్సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనైనా సులభంగా జరుగుతుందన్నారు. లక్ష్మీనృసింహుని దివ్యానుగ్రహంతో పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మం ఎపుడూ దృఢంగా ఉండాలి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏటా నృసింహ జయంతి రోజున స్వామివారి పూజా కార్యక్రమాలు నిమిత్తం శృంగేరి పీఠం తరఫున శాశ్వత విరాళంగా రూ.లక్షా 11 వేల 116 నగదును దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణకు మహాస్వామి అందజేశారు. వేదిక వద్ద రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమారరామగోపాలరాజా బహద్దూర్, మహాస్వామి ఆశీస్సులు అందుకున్నారు. తొలుత అంతర్వేది బీచ్‌లో భారతీ మహా స్వామి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఆలయంలోని పార్వతీదేవి అమ్మవారిని మహాస్వామి దర్శించుకున్నారు. కాగా స్వామీజీ మంగళవారం సాయంత్రం వానపల్లిలో పర్యటించారు. రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్న ఆయనకు భక్తులు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర నిర్వహించారు.





