
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస్ వర్గ ద్వితీయ (విశేష) నాగపూర్ లో ప్రారంభమైంది. రేషంబాగ్ లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్ లో వ్యాస మహర్షి ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఉద్ఘాటన కార్యక్రమంలో సహ సర్ కార్యవాహలు డాక్టర్ కృష్ణగోపాల్, ముకుంద్, రామదత్ తదితరులు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు అఖిల భారతీయ సహ సేవా ప్రముఖ్, వర్గ పాలక్ రాజ్ కుమార్ మటాలే, జోధ్ పూర్ ప్రాంత సంఘచాలక్, సర్వాధికారి హర్దయాల్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాత విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ వికాస వర్గకి దేశవ్యాప్తంగా 40 ఏళ్లు పైబడిన 868 మంది స్వయంసేవకులు ఈ వర్గలో పాల్గొన్నారు. ఈ వర్గ 25 రోజుల పాటు కొనసాగుతుంది. డిసెంబర్ 12 న ముగుస్తుంది. ఈ వర్గలో సామాజిక అవగాహనతో పాటు సామాజిక పరివర్తనపై శిక్షణ అందిస్తారు.
ఈ సందర్భంగా వర్గ పాలక్ రాజ్ కుమార్ మాటాలే మాట్లాడుతూ… హెడ్గేవార్, గురూజీ పుణ్యభూమిలో జరుగుతున్న ఈ విశేష వర్గ చారిత్రాత్మకమని అభివర్ణించారు. సంఘం నిర్దేశించుకున్న నూతన పద్ధతుల ప్రకారం ఈ వర్గ జరగడం ప్రథమమని, జాతీయ ఐక్యత, సహజీవన భావన ఈ వర్గతో వస్తుందన్నారు. సంఘ వ్యవస్థలో శిక్షావర్గలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, కార్య విస్తరణ జరుగుతున్న కొద్దీ… వివిధ దశల్లో శిక్షా వర్గలు జరుగుతాయన్నారు.
సంఘ్ 1925 లో ప్రారంభమైందని, శిక్షావర్గ 1927 లో ప్రారంభమైందని తెలిపారు. ఎమర్జెన్సీ, కరోనా కాలం మినహాయిస్తే… ప్రతి యేటా వర్గలు జరుగుతున్నాయని వివరించారు. కాలక్రమేణా వర్గలో వ్యవధి, పాఠ్యాంశాలు, సమకాలీన అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భావజాలం, స్వయంసేవక్ పాత్ర, కార్యపద్ధతి, కార్యకర్త నిబద్ధత, సవాళ్లను ఎదుర్కొనే పద్ధతి, సమాజంలో సానుకూల మార్పు ఎలా తీసుకురావాలి? అన్న అంశాలపై స్పష్టతనిస్తామని తెలిపారు.
డాక్టర్జీ ఆద్య సరసంఘచాలక్ అని, వారు మోహిత ప్రాంతంలో మొదటి శాఖ ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సంఘం విస్తరించిందని తెలిపారు. అయితే… ఏ పని అయినా మొదట్లో నిర్లక్ష్యం, అపహాస్యం, వ్యతిరేకత వస్తుందని స్వామీ వివేకానంద అన్నారని, అదే విధంగా సంఘ్ విషయంలోనూ జరిగిందన్నారు. సంఘ్ ప్రారంభ దశల్లో ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. కానీ నేడు సంఘ్ విస్తృత ఆమోదం పొందిందని హర్షం వ్యక్తం చేశారు. బహిరంగంగా సంఘ్ ని విమర్శించేవారు.. ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం తెగ మెచ్చుకుంటున్నారని రాజ్ కుమార్ మాటాలే అన్నారు.





