
శ్రీకాకుళం: ఆషాఢ మాసం సందర్భంగా ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల్లో గ్రామదేవతల వార్షిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
నందిగాం మండలంలోని జల్లపల్లి గ్రామంలో గ్రామదేవత కొత్తమ్మతల్లి వార్షిక సంబరాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలు, ఆటపాటల నడుమ మహిళలు ముర్రాటలతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామదేవతల ఉత్సవాల సందర్భంగా బంధువులు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్థులు స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
నందిగాం మండలంలోని నరేంద్రపురంలో రెయ్యిబోడమ్మ మరియు భూలోకమాత గ్రామదేవతల సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రామస్థులు, ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఊరేగింపుగా వెళ్లి దేవర్లను తీసుకురావడంతో గ్రామమంతా భక్తి వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు కోలాటాలు, మేళతాళాలు, బాణాసంచా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన దేవతామూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవారం అంజలి రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, సీతానగరం గ్రామాల్లో పాలపోలమ్మ (బల్లోల సంబరాలు) మరియు తోటపోలమ్మ అమ్మవార్ల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పగటివేషాల ప్రదర్శనలు, గ్రామోత్సవ ఊరేగింపులు నిర్వహించగా, రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ గ్రామదేవతల ఉత్సవాలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి.





