News

భూమిని ఆక్రమించిన కమ్యూనిస్టులు.. సర్వేకి ఆదేశించిన కేరళ యూనివర్సిటీ

25views

కేరళ సీపీఎం పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం (ఆఫీసు) అయిన ఏకేజీ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్, కేరళ విశ్వవిద్యాలయ భూమిలో ఉందనే ఆరోపణల నేపథ్యంలో, విశ్వవిద్యాలయానికి చెందిన భూమి పరిధిని కొలిచి, నిర్ధారించాలని కేరళ యూనివర్సిటీ కమిటీ నిర్ణయించింది.

ఇటీవలే సిండికేట్ సభ్యుడిగా నియమితులైన, ‘సేవ్ యూనివర్సిటీ క్యాంపెయిన్ కమిటీ’ చైర్మన్ ఆర్.ఎస్. శశికుమార్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కేరళ యూనివర్సిటీ మాజీ జాయింట్ రిజిస్ట్రార్. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సజావుగా, సక్రమంగా మరియు చట్టబద్ధంగా పనిచేయడం కోసం ఆయన సంస్థ పోరాడుతూ వుంటుంది.

ఏకేజీ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్ కేరళ యూనివర్సిటీ ఆవరణకు ఆనుకుని ఉంది.వర్సిటీకి చెందిన 15 సెంట్ల భూమిని ఆక్రమించి నిర్మించినందున, కేరళ యూనివర్సిటీ ఆవరణ నుండి సిపిఎం భవనాన్ని ఖాళీ చేయించాలని కోరుతూ ఆర్.ఎస్. శశికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏకేజీ సెంటర్ కోసం యూనివర్సిటీ భూమి, పురంబోకు భూమితో కలిపి మొత్తం 55 సెంట్ల భూమిని ఆక్రమించారని కూడా ఆ పిటిషన్‌లో ఆరోపించారు. వాటిని ఖాళీ చేయించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

ఏకేజీ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్ మరియు సిపిఎం ఆక్రమించిన పురంబోకు భూమిలో, తిరువితాంకూర్ మహారాజు కేరళ యూనివర్సిటీకి బహుమతిగా ఇచ్చిన భూమి కూడా ఉందని శశికుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమిపై సిపిఎం మరియు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) లకు ఎలాంటి చట్టపరమైన హక్కు లేదని అందులో పేర్కొన్నారు.

అసలు ఏకేజీ సెంటర్ కోసం భూమిని 1977లో సేకరించారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎ.కె. ఆంటోనీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి గాను కేరళ యూనివర్సిటీకి చెందిన సుమారు 15 సెంట్ల భూమిని ఏకేజీ మెమోరియల్ కమిటీకి కేటాయించారు.

ఈ కేటాయింపు కాస్తా ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన వివాదంగా మారింది. దివంగత సిపిఎం నాయకుడు ఎ.కె. గోపాలన్ స్మరనార్థం రీసెర్చ్ సెంటర్ మరియు లైబ్రరీ కోసం ఈ భూమిని మొదట కేటాయించారు. అయితే, సీపీఎం దీనిని చాలా వేగంగా తన అధికారిక రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా మార్చేసిందని, ఇది భూమి కేటాయింపు యొక్క అసలు ఉద్దేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శకులు మరియు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించారు.

అధికారిక రెవెన్యూ రికార్డులు, ఆ తర్వాత వచ్చిన ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) విచారణలు ఈ ఆస్తి ప్రభుత్వ రెవెన్యూ (పురంబోకు) భూమి మరియు యూనివర్సిటీ భూమిపై నడుస్తోందని సూచించాయి. కేరళ యూనివర్సిటీకి చెందిన అదనపు భూమిని ఆక్రమించారనే ఆరోపణలు మరియు యాజమాన్య హక్కులపై సిపిఎం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.