
1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో మతపరమైన విద్యను ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్‌లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం భారత ఉపఖండంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. 1947లో భారత విభజన తర్వాత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఈ మదర్సాల అభివృద్ధి వేర్వేరు మార్గాల్లో కొనసాగింది. ప్రస్తుతం దేవబంద్ నుంచి ప్రారంభమైన ఖౌమీ (దేవబంది) మదర్సాల నెట్‌వర్క్‌లో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సంస్థల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, విస్తరణ పరంగా బంగ్లాదేశ్ భారత్, పాకిస్థాన్‌లను అధిగమించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవబంది మదర్సాల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మంది బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లోని ఖౌమీ విద్యా బోర్డు బెఫాకుల్ మదరిసిల్ అరబియా గణాంకాల ప్రకారం.. దేశంలో రిజిస్టర్ అయిన దేవబంది మదర్సాల సంఖ్య సుమారు 32,730గా ఉంది. వీటిలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ఇతర ఖౌమీ బోర్డుల పరిధిలో మరో 10 వేలకు పైగా మదర్సాలు ఉన్నట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌లో మొత్తం ఖౌమీ మదర్సాల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో జమియత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలోని మదర్సాల సంఖ్య సుమారు 20,900గా ఉండగా, విద్యార్థుల సంఖ్య 23 లక్షలకు పైగా ఉంది. పాకిస్థాన్‌లో సుమారు 27 వేల దేవబంది మదర్సాలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.





