ArticlesNews

వక్ఫ్ బోర్డు తాఖీదులకు ప్రతిఘటన మొదలయిందా?

212views

వక్ఫ్ బోర్డ్ దూకుడుకు ప్రతిఘటన మొదలైనట్టే ఉంది. ఊళ్లకు ఊళ్లు తమవేనని వక్ఫ్ బోర్డు తరఫున ప్రభుత్వాలు ప్రకటించడం, దాని మీద రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆగమేఘాల మీద రాజకీయ నాయకుల దగ్గరకి, కోర్టులకి పరుగెత్తడం ఇటీవలి పరిణామం. వక్ఫ్ బోర్డు వచ్చి తమను ఇళ్లు ఖాళీ చేయిస్తుందన్న భయంతో కర్ణాటకలోని ఒక గ్రామంలో అక్టోబర్ 29 రాత్రి ‘ఒక వర్గం’ మీద ఇంకొందరు దాడి చేశారు. ఆ వర్గం ఇళ్లను, దుకాణాలను లక్ష్యంగా చేసుకుంది. హవేరి జిల్లా కడాకోల్ గ్రామంలో ఇదంతా జరిగింది. దరిమిలా 200 మంది పోలీసులు, నాలుగు కర్ణాటక స్టేట్ రిజర్వ పోలీసు ప్లాటూన్లు అక్కడ పహరా కాస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల కోసం బీజేపీ కుట్ర పన్నుతున్నదని, అందుకే రైతులను, గ్రామస్థులను రెచ్చగొడగుతున్నదని కర్ణాటక వక్ఫ్ వ్యవహారాల మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.

మత ఉద్రిక్తతలు ఎరుగని కడాకోల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం విచారకరమని మంత్రి చెప్పారు. ఆ గ్రామంలోని ఒక ఆలయానికి చెందిన ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడంతో ఈ గొడవ మొదలయింది. వాటిని త్వరలోనే స్వాధీనం చేసుకుంటారన్న వదంతులు వ్యాపించాయి.

తాము వక్ఫ్ తమవిగా చెబుతున్న భూముల గురించి వివరాలు సేకరించమని చెప్పామని, దీని అర్ధం అవన్నీ వక్ఫ్ ఆస్తులు అని కాదని డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేశ్ చెప్పారు. రైతులకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించు కోవాలని హవేరీ లోక్ సభ సభ్యుడు, మాజీ ముఖ్య మంత్రి బసవరాజన్ బొమ్మయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే వక్ఫ్ బోర్డ్ గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చే ప్రయత్నంలో ఉందని మరొక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు.

ఎంత రగడ, ఎంత సంక్షోభం తలెత్తవచ్చు గాక, అయినా తనను రాష్ట్ర మంత్రిమండలి నుంచి తొలగించలేరని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ గందరగోళం నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన విమర్శకు సమాధానంగా ఆయన ఈ మాట చెప్పారు. దేశానికి రైతులే వెన్నెముక అని, దేశంలో ప్రతివారి ఆస్తి రక్షణకు చట్టం ఉందని అన్నారు. పరాధీనమైన ఆస్తుల కోసం తాము వక్ఫ్ న్యాయ స్థానం ఆశ్రయమిస్తున్నామని, ప్రభుత్వం నుంచి వక్ఫ్ భూమి తీసుకోలేదని అన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన మొత్తం 84,000 ఎకరాలలో 23,000 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని ఆయన చెప్పారు. అదనంగా 38,000 ఎకరాలు ముజరాయ్ శాఖకు చెందినవని, మరొక 700 ఎకరాలు కూడా ఆక్రమ ణలో ఉన్నాయని మంత్రి లెక్క చెప్పారు.