News

భారీ వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత..

26views

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో యాత్ర మార్గాలు ప్రమాదకరంగా మారాయి.

భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయడంతో కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు వెళ్లే మార్గాల్లో యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం యాత్రలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల ప్రభావంతో అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రుద్రప్రయాగ్ సహా పలు ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయక, విపత్తు నిర్వహణ బృందాలు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాయి.

వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాత, సంబంధిత నిపుణులు యాత్ర మార్గాల భద్రతను పరిశీలించి అనుమతి ఇచ్చిన అనంతరమే చార్‌ధామ్ యాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఈ ఏడాది యాత్రా సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, ఇప్పటివరకు 44.8 లక్షలకు పైగా భక్తులు చార్‌ధామ్ పవిత్ర క్షేత్రాలను దర్శించుకున్నట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వెల్లడించింది.