
261views
ప్రాణం ఎలా నిలబెట్టుకోవాలన్నది పుస్తకాల్లో పాఠంగా ఉన్నా… ఆ ప్రాణం నిలబెట్టే దైవం గురించి ఏ పాఠ్యపుస్తకాల్లోనూ లేదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ప్రవచించారు. ఆ విషయం తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస కలిగిన వారికి వారం రోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికాస తరంగణి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర మైదానంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీమద్రామాయణంలోని పలు ఘట్టాలను ఉటంకిస్తూ… కోదండ రాముడి పాదుకల వైశిష్ట్యాన్ని వివరించారు. హాజరైన భక్తులకు నిర్వాహకులు పంచలోహ పాదుకలు అందజేశారు. శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. వికాస తరంగణి జిల్లా అధ్యక్షుడు తడికమళ్ల హరిప్రసాదరావు, ఆడిటర్ పి.వి.రంగనాథం, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.





