
క్రైస్తవ సంస్థలను క్రమబద్ధం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమేనని మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) అభిప్రాయపడింది. అంతేకాదు, వివిధ క్రైస్తవ సంస్థలలో ఆస్తుల, నిధుల దుర్వినియోగానికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికే కోర్టు దృష్టికి వచ్చాయని కోర్టు తీవ్రంగానే వ్యాఖ్యానించింది. క్రమబద్ధీకరణకు వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి మీ మీ వైఖరులతో నివేదికలను సమర్పించ వలసిందిగా కేంద్ర హోంశాఖకు, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అక్టోబర్ 23న ఇచ్చిన ఆదేశాలలో హైకోర్టు సూచించింది. హిందువులకీ, ముస్లింలకీ ఇలాంటి ధర్మాదాయ వ్యవస్థలకు సంబంధించి క్రమబద్ధీకరణకు సంస్థలు ఉన్నప్పటికీ క్రైస్తవులకు లేవని కోర్టు తెలియచేసింది. కన్యాకుమారిలోని స్కాట్ క్రిస్టియన్ కళాశాల కరస్పాండెంట్ నియామకానికి నెల నెలా జీతాల చెల్లింపు గురించి కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపి మద్రాస్ హైకోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
చర్చి ఆస్తులు, నిధులు దుర్వినియోగం కావడమే కాకుండా, వివిధ సందర్భాలలో నిర్వాహకులు తమ తమ పదవులను రక్షించుకునేందుకు కోర్టులకు ఎక్కుతూ చర్చి ధనం వినియోగిస్తున్నారని కూడా
జస్టిస్ సతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అక్కడి పాలన వ్యవహారాల పరిశీలను కోర్టులు పరిపాలకులను అప్పుడప్పుడు నియమిస్తున్నప్పటికీ అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, కాబట్టి శాశ్వత మైన, చట్టబద్ధమైన వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. క్రైస్తవ సంస్థలు జవాబు దారీతనంతో ఉండేలా చూడవలసి ఉంటుందని కూడా తేల్చి చెప్పింది.





