ArticlesNews

జాతీయ ఆత్మాభిమానం వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం

250views

( నవంబరు 15 – వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం )

సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు జాతీయ ఆత్మాభిమానం, శౌర్యం మరియు ఆతిథ్యం యొక్క భారతీయ విలువలను ప్రోత్సహించడంలో వనవాసీల కృషికి గుర్తింపుగా ప్రతి ఏడు నవంబరు 15న వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు వనవాసీల ఆత్మగౌరవ పరిరక్షకుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు భగవాన్ బిర్సా ముండా జన్మదినం కూడా. బిర్సా ముండా వంటి కీర్తికి నోచుకోని వనవాసీ వీరుల పరాక్రమాన్ని, త్యాగాలను ప్రజలందరికీ తెలిసేలా చేయడమే ఈ వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం ఉద్దేశం. వనవాసీ సహోదరులు మన సమాజంలోని ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమైనందున వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు నిర్వహించుకోవాల్సిన పండుగ.

మన ఆరాధ్య దేవీదేవతా అవతారాలకు గిరిజన సమాజానికి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. ఎందుకంటే, మన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుని తల్లి కౌశల్య..కన్వర్ తెగకు చెందిన ‘‘కశ్యప్’’ గోత్రానికి చెందినవారు. కన్వర్ తెగ ప్రజలు కౌశల్యను తమ కుమార్తెగా పూజిస్తారు. రాముడు గిరిజన సమాజానికి చెందిన మేనల్లుడిగా పరిగణించబడ్డాడు. అదే విధంగా అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన ట్రిబేరాజా బాన్ కుమార్తె ఉష మరియు శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధ ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కావున, మన ఆరాధ్య దైవాలు అయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇరువురూ వనవాసీ సమాజంతో సామాజికంగానే కాకుండా రక్తబంధంతో కూడా అనుసంధానించబడ్డారు.

ఎందరో వనవాసీయులు విదేశీ బానిసత్వం నుండి భారతీయ సమాజాన్ని విముక్తి కల్పించేందుకు కృషి చేశారు. కావున వనవాసీ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించడం కేవలం వనవాసీ సమాజానికి చెందినది మాత్రమే కాదు ఇది మనందరి కర్తవ్యం. మన సువిశాల భారతదేశంలోని వనవాసీ సమాజం ఆరాధ్యదైవంగా భావించే భగవాన్ బిర్సా ముండా జన్మదినోత్సవం కావడంతో నవంబరు 15వ తేదీకి మరింత ప్రాముఖ్యత లభించింది.

బిర్సా ముండా ప్రస్తుత జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామంలో 1875 నవంబరు 15న జన్మించారు. అడవిలో జీవించే వారిపై బ్రిటిష్ పాలకులు చేసిన అన్యాయాలు, అరాచకాలను చూస్తూ పెరిగిన ఆయన తన సమాజ ఆత్మాభిమాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. మత పరమైన విషయాలలో వనవాసీల జీవన విధానాలను, సంస్కృతిని అవమానించే మిషనరీలకు ఎదురు నిలిచి తన సమాజంలో చైతన్యం నింపాడు. వనవాసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విముక్తి కోసం వలసవాద పాలకులకు, దోపిడీదారులకు వ్యతిరేకంగా బిర్సా తిరుగుబాటు ఉద్యమం సాగించారు భగవాన్ బిర్సా ముండాగా, ధర్తీ ఆబాగా వినూతికెక్కాడు.

వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా 18వ శతాబ్దం నుండి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని గిరిజన నాయకులు మరియు వారి సంఘాలు చేసిన పోరాటాలను కొన్నింటిని స్మరించుకోవడం సముచితం. ఆ జాబితాలో తిలకా మాంఝీ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఝార్ఖండ్‌లో సంతాల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. అలాగే, నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురి అవుతున్న ఉత్తర తెలంగాణలోని వనవాసీ ప్రజల విముక్తి కోసం గెరిల్లా పోరాటం చేసిన మన్యం వీరుడు కొమరం భీమ్. వనవాసీలకు స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 వరకు నిజాం నవాబులపై రణభేరి మోగించి, నిజాంల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడు. ఇక బుధు భగత్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించాడు. ఈయన 1831 -32లో చోటానాగ్‌పూర్‌లో కోల్ తిరుగుబాటు, లార్కా తిరుగుబాటుకు నాయకులు. అలాగే, ఈశాన్య భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు టిరోట్ సింగ్. ఖాసీ కొండలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింనందుకు టిరోట్ సింగ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. అలాగే 1850 నుంచి 1860 మధ్య కాలంలో చోటానాగ్‌పూర్ ప్రాంతంలో బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వనవాసీ స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగా ఖారియాను సైతం ఈ వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడం సముచితం.

వీరే కాదు సిద్ధు మరియు కన్హు ముర్ము, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నిలంబర్ మరియు పితాంబర్, బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా వనవాసీలతో సంబల్పూర్ తిరుగుబాటు చేసిన వీర సురేంద్ర సాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తం బుర్రయ్య దొర, అల్లూరి సీతారామరాజు, మామా అల్లుళ్లు దివా సోరెన్, కిసున్ సోరెన్, ఈశాన్య వనవాసీ ప్రాంతానికి చెందిన పా తోగన్ సంగ్మా, 1833లో రాజస్థాన్‌లో జరిగిన మొదటి భిల్ ఆందోళనకు నాయకత్వం వహించిన గోవింద్ గురు బంజారా, మణిపూర్‌కు చెందిన తంగల్ జనరల్, బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడిన మణిపూర్ సైనికాధికారి పౌనా బ్రజబాషి, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు మట్మూర్ జమోహ్, వనవాసీ నాయకుడు గుండా ధుర్, జాత్రా భగత్, మాంగ్రీ ఒరాంగ్, రోంగ్‌మీ నాగా తెగకు హైపో జాడోనాంగ్, దక్షిణ ఒడిశాలోని భుయాన్ తెగకు చెందిన లక్ష్మణ్ నాయక్, వనవాసీ సేవా మండల్ స్థాపకురాలు రాజ మోహినీ దేవి, 1832-33 కాలంలో భూమిజ్ తిరుగుబాటు నాయకుడు గంగా నారాయణ్ సింగ్ ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో వనవాసీ యోధులు తమ మాతృభూమి సేవలో తరించారు. ప్రాణత్యాగాలు చేశారు. వీరి స్ఫూర్తివంతమైన చరిత్రను దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వారి చరిత్రను ప్రజలకు తెలియజేయడమే వారికి మనం అందించే అర్థవంతమైన నివాళి కావచ్చు.