ArticlesNews

విశ్వ‌మాన‌వ సౌభ్రాతృత్వ ప్ర‌చార‌కుడు గురునాన‌క్

335views

( నవంబర్ 15 – గురునాన‌క్ ప్రకాష్ ఉత్సవ్ )

భార‌త‌దేశంలో మ‌ధ్య యుగంలో అవ‌త‌రించిన మ‌హాపురుషుల్లో గురునాన‌క్ దేవ్ జీ అగ్ర‌గ‌ణ్యులు. గురునాన‌క్ 1469లో అప్ప‌టి పంజాబ్ రాష్ట్రం రాయ్ భోయ్ త‌ల్హాండీ గ్రామంలో జ‌న్మించారు. బాల్యం నుంచే విభిన్న‌, విల‌క్ష‌ణ మ‌న‌స్త‌త్వం క‌న‌బ‌రిచిన నాన‌క్ మాటల్లో, చేతల్లో సర్వ మాన‌వ స‌మతా దృష్టి వ్య‌క్త‌మ‌వుతూ ఉండేది. మూఢాచారాలు, సంప్ర‌దాయాల‌ను తిర‌స్క‌రించేవారు. వ‌ర్ణాశ్ర‌మ వ్య‌వ‌స్థ‌ను గానీ, అస్పృశ్య‌త‌ను కానీ పాటించ‌లేదు. ఉప‌న‌య‌న సంస్కారం కంటే ఆత్మ సంస్కారం అవ‌స‌రమ‌ని చెప్పేవారు. విశ్వ‌మాన‌వ సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్ర‌చారం చేశారు. నేను హిందువును… ముస్లింను చూడ‌టం లేదు. మ‌నిషిని చూస్తున్నాను అన్న పలుకులు నాన‌క్ స‌మ‌తా దృష్టికి నిద‌ర్శ‌నం. కుల‌, మ‌త భేదాలు లేని స‌ర్వ మాన‌వ స‌మాన‌త్వం, ప్రేమ‌తత్వాన్ని పెంపొందించే దివ్య ధ‌ర్మంగా నానక్ బోధించిన సిక్కు ధ‌ర్మం.. గురు గోవింద్ సింగ్ వ‌ర‌కూ మొత్తం ప‌ది మంది గురువుల నేతృత్వంలో విక‌సించి, నేటికీ ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ర్థిల్లుతోంది. ప్రాంతీయ భాషలో, సామాన్యులకు సైతం అర్థమయ్యే శైలిలో రచనలు, బోధనలు, పాటలు, పద్యాలు, భజనలతో మోక్ష సాధనకు భక్తి మార్గాన్ని అవలంబించాలని చాటిన భక్తి ఉద్యమకారుల్లో నానక్ దేవ్ జీ కూడా ఒకరు.

ప్ర‌పంచ వ్యాప్తంగా గురునానక్ చేప‌ట్టిన దివ్య ఆధ్యాత్మిక యాత్రలను ఉదాసీలుగా పిలుస్తారు. తన శిష్యుడైన మర్దానాతో కలిసి ఆయన ఎక్కువగా కాలినడకననే ప్రయాణాలు చేశారు. ఈ యాత్ర‌ల్లో ఆయ‌న చేసిన బోధ‌లు ఎంద‌రిలోనే ప‌రివ‌ర్త‌న క‌లిగించాయి. వేలాది మంది ఆయ‌న‌కు అనుయాయులుగా, శిష్యులుగా మారిపోయారు. 1500-1524 మధ్య కాలంలో ఆయ‌న ప్రపంచవ్యాప్తంగా 28,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారని అంచ‌నా. అత్యధికంగా ప్రయాణాలు చేసిన రికార్డు మొరాకోకు చెందిన ఇబ‌న్ బటూటా పేరిట ఉంది. టర్కీలోని గురునానక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన గురునానక్ స్మారక చిహ్నంపై… ఈ కాల‌పు దేవుడు. భారతదేశ నివాసి… నానక్ దేవుడి మనిషి అని అరబిక్/ పర్షియన్/ టర్కిష్ భాషల‌లో రాసి ఉంది.

మదీనాకు ప్రయాణించిన తరువాత, గురునానక్ దేవ్.. బాగ్దాద్ చేరుకుని నగరం వెలుపల బ‌స చేశారు. ఆ స‌మ‌యంలో ప్రార్థన చేయమని అక్క‌డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అందులో `ముహమ్మద్ అర్ రసూల్ అల్లాహ్‌`ను వదిలివేసి, వాటి స్థానంలో అదే భావంతో కూడిన అరబిక్ పదాలను ఉప‌యోగించ‌డంతో ప్ర‌జ‌లంతా కోపంతో నానక్‌ను బావిలోకి తోసి రాళ్లతో కొట్టారు. అయినా కూడా ఆయ‌న‌ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బ‌య‌ట‌కు రావడంతో వారంతా ఆశ్చ‌ర్యపోయారు. ఇది చూసిన ఇరాక్ ఆధ్యాత్మికవేత్త పీర్ బహ్లోల్ షా ఆయ‌న్ను పవిత్ర, పరిపూర్ణ సాధువుగా గుర్తించి, ఆధ్యాత్మిక చర్చలకు ఆహ్వానించారు.

గురునానక్ ను బహ్లోల్ షా మూడు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానాలు లభించ‌డంతో నానక్‌కు చేసిన అన్యాయానికి ప్ర‌జ‌ల‌ను క్షమించాలని, అక్క‌డే మ‌రికొంత‌ కాలం ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు గురునానక్ 17 రోజులు అక్కడే ఉన్నారు. ఈ కాలంలో పీర్ బహ్లోల్ కుమారుడితో కలిసి గురునానక్ దివ్యలోకానికి (సూక్ష్మ ప్రయాణం) చేపట్టారు. వారిద్ద‌రూ సెక‌ను వ్య‌వ‌ధిలోనే అంత‌ర్థాన‌మై పోయారు. తిరిగి వ‌స్తూ త‌మ‌తోపాటు ఒక గిన్నె నిండా పవిత్రమైన ఆహారాన్ని భూమికి తీసుకొచ్చారు. ఈ సూక్ష్మ ప్రయాణంపై ప్ర‌స్తుతం శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌నలు చేస్తున్నారు. అక్క‌డినుంచి గురునాన‌క్‌ నిష్క్రమించిన‌ తరువాత, ప్ర‌జ‌లు ఆయ‌న ప్రసంగించిన వేదిక వ‌ద్ద ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలం తరువాత స్టేజీపై ఒక గదిని నిర్మించారు. అందులో టర్కిష్ భాషలో శాసనాలతో కూడిన రాతి పలకను ఉంచారు. 2003 యుద్ధంలో ఈ మందిరం పూర్తిగా శిథిలమైంది. 1539 సెప్టెంబరు 22న‌ గురునానక్ త‌న‌ 70వ ఏట శ‌రీర త్యాగం చేశారు.