
భారత్ లో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని సురభి సత్సంగం డిమాండ్ చేసింది. దేశమంతా గోవులను రక్షించడానికి రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీలోని హరిహరానంద క్రియాయోగా గురుకుల్ ఆశ్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అర్చకులు, గోసేవకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్వామి సమర్పనానంద గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పరాయి పాలనలో కూడా గోహత్యపై ఆంక్షలున్నాయన్నారు. భారత్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోహత్యపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గోహత్యను నిషేధించడానికి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటే దీనిని సరిదిద్దే అవకాశాలున్నాయన్నారు. గోహత్యపై ప్రభుత్వాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బృందావన్ నుంచి వచ్చిన దయానిధి దాస్ మహారాజ్ మాట్లాడుతూ గోహత్యపై కేవలం నిషేధం విధిస్తేనే సరిపోదన్నారు. భారత్ అంతటా గోశ్రేయస్సు కోసం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శ్రేయస్సు అంతా గోవుల సంక్షేమంతో ముడిపడి వుందని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం గోసంక్షేమాన్ని చూడాల్సిన అవసరం వుందని అన్నారు.
పూరీలోని నిగ్మానంద ఆశ్రమానికి చెందిన స్వామి శంకరానంద సరస్వతీ మాట్లాడుతూ… గోసంరక్షణ విషయంలో తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. భారత దేశం పవిత్రమైన భూమి అని, అలాంటి భూమిలో గోసంరక్షణ కోసం అవగాహన సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. అయితే… గో సంపదను కాపాడుకోవడానికి అందరూ ఐక్యం కావాలని, ఈ ప్రయత్నానికి అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
భువనేశ్వర్ లోని కల్పతరు ఆశ్రమానికి చెందిన స్వామి బ్రహ్మానంద సరస్వతీ మాట్లాడుతూ… భారత్ లో గో రక్షణ ఆధ్యాత్మికతతో ముడిపడి వుందన్నారు. గోమాతతో విశ్వకల్యాణం సాధ్యమవుతుందని, ఆవు తల్లితో సమానమన్న విషయాన్ని అనేక పురాణాలు కూడా చెబుతున్నాయన్నారు. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత గోరక్షులదేనని, భక్తులదేనని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం, పాలనా అధికారులది కూడా అంతే బాధ్యత వుందని పేర్కొన్నారు.
ఇక… మూడో రోజు ఈ సమ్మేళనంలో బాబాజీ దీనబంధు దాస్ ప్రారంభించిన గో విజ్ఞాన్ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పాటు ఈ కార్యక్రమం కూడా సాగింది. పూరీలోని హరిహరానంద్ క్రియాయోగ గురుకుల ఆశ్రమంలో గౌ నవరాత్రి మహోత్సవం వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. కార్తీక శుక్ల ప్రతిపద నుండి అక్షయ నవమి వరకు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, ఈ పండుగ దేశవ్యాప్తంగా పూజారులు మరియు భక్తులను ఆకర్షిస్తుంది. గోవుల వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు భారతదేశం అంతటా గోవు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి అందర్నీ ఓ చోట చేర్చడంలో ఉపయోగపడుతుంది.
మరోవైపు ఈ సమ్మేళనంలో స్వామీజీలతో పాటు గోసంరక్షకులు, వ్యవసాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవుతో వ్యవసాయం ఎలా ముడిపడి వుంటుందో కూలంకషంగా వివరించారు. దేశవాళీ విత్తనాలను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే దానిపై అవగాహన కూడా కల్పించారు. దీంతో పాటు గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించారు. ఆవు పేడ, మూత్రం, ఇతర సేంద్రీయ ఉత్పత్తుల గురించి కూడా మార్గదర్శకత్వం చేశారు. అలాగే రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే దీర్ఘకాలిక హాని గురించి కూడా వివరించారు. ఈ సమ్మేళనంలో 3,000 మంది భక్తులు, రైతులు, గోరక్షకులు పాల్గొన్నారు. గో ఆధారిత సేంద్రీయ పద్ధతుల గురించి కూడా వివరించారు.





