News

JNU లో శివాజీ మహారాజ్ పై ప్రత్యేక పరిశోధనలు.. ప్రత్యేక కోర్సు కూడా

259views

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఛత్రపతి శివాజీపై కీలకమైన పరిశోధనను ప్రారంభిస్తోంది. ఈ పరిశోధన ‘‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’’ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరిశోధన 2025-2026 అకాడెమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కానుంది.ఈ శోధన కోసం ఇతర పండితుల సహాయాన్ని కూడా జేఎన్ యూ తీసుకోనుంది. ఇప్పటికే JNU అకాడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అంతర్జాతీయ సంబంధాలలో భారత దేశ పాత్రపై అసలు కీలకమైన పరిశోధనలు జరగడం లేదని ఓ ప్రొఫెసర్ కి అనిపించింది. దీంతో ఈ ఆలోచన వచ్చిందని అధికారులు తెలిపారు.

నిజానికి విద్యార్థులు ఛత్రపతి శివాజీ యుద్ధనీతి, వ్యూహాలు, ఆలోచన, దౌత్యం నెరిపిన తీరుపై అత్యంత శ్రద్ధ చూపుతారు. కానీ… ఇది పట్టించుకోకుండా విదేశాల యుద్ధ నీతుల గురించి బోధనలు జరుగుతున్నాయన్నది ఆ ఫ్రొఫెసర్ అంటున్నారు. అందుకే శివాజీపై కీలక పరిశోధనలు జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. పూణె యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికే శివాజీకి చెందిన ఆర్కైవ్స్, పత్రాలు, మిగతా కీలక విషయాలు తమ యూనివర్శిటీకి చేరాయని జేఎన్ యూకి చెందిన సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ అమితాబ్ మట్టూ ప్రకటించారు.

ఈ పరిశోధన సంపూర్ణం కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. దీంతో పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ప్రొఫెసర్ మట్టూ అభిప్రాయపడ్డారు. అలాగే ఇదే విషయంపై కొన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు కూడా లాభం పొందవచ్చన్నారు.