News

పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

300views

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక సీజన్‌ ప్రారంభమైందని, పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తారన్నారు. ఏజెన్సీ ముఖ ద్వారాల వద్ద పర్యాటకుల వాహనాలు, పర్యాటకుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలన్నారు. పర్యాటక, అటవీ ప్రాంతాల్లో క్యాంపు ఫైర్‌ నిర్వహించకూడదని, నిర్దేశించిన ప్రదేశాల్లో క్యాంపు ఫైర్‌ నిర్వహించేందుకు ముందుగా అనుమతులు పొందాలన్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనధికారికంగా క్యాంపు ఫైర్‌లు నిర్వహిస్తే మహిళా పోలీసులు, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక ప్రాంతాల పరిధిలో గ్రామ, మండల, ఐటీడీఏ, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యాటకం నేపథ్యంలో పర్యావరణానికి, అడవులకు హాని కలిగిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.