News

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువుల భారీ నిరసన

250views

బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం చేసే వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలే అని అర్థమైపోతున్నాయి. హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం ఎన్నిక ప్రకటనలు చేస్తున్నా… అమలు విషయంలో మాత్రం వెనుకంజే. తాజాగా చిట్టగాంగ్ లోపని లాల్దిఘీ మైదానంలో హిందూ సమాజం భారీ ప్రదర్శన నిర్వహించింది. హిందువులు, అక్కడి మైనారిటీలపై ముస్లిం ఛాందసులు చేస్తున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడుల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ సనాతన జాగరణ్ మంచ్ ప్రతినిధి పుండరీక్ ధామ్ అధినేత చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మాచారి మాట్లాడుతూ.. ఈ దేశం నుంచి తమను వెళ్లగొట్టి, శాంతియుతంగా జీవించాలని అనుకుంటే బంగ్లాదేశ్ సిరియా లేదా ఆఫ్గనిస్తాన్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

అదే గనక జరిగితే బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశంగా వుండదని, మత తత్వానికి అడ్డాగా మారిపోతుందన్నారు. కొన్ని రోజులుగా హిందువులపై, అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అలాగే దసరా ఉత్సవాల్లో దుర్గా మండపాల విషయంలోనూ డబ్బులు డిమాండ్ చేస్తూ, బెదిరింపులకు దిగారని మండిపడ్డారు. ఇవన్నీ జరుగుతుండగానే హిందువుల పండుగలకు, హిందువులకు రక్షణ కలిపిస్తామని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బీరాలు పలికిందని, కానీ ఆచరణలో మాత్రం అది లేదని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే బంగ్లాదేశ్ పోలీసు సర్వీసుల నుంచి 93 మంది హిందూ పోలీసులను బహిష్కరించారని, దీనిపై సమాధానం చెప్పాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. వీటితో పాటు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయింపుల్లోనూ హిందువులకు అన్యాయం జరిగిందని అని వెల్లడించారు. మొత్తం 15,000 కోట్ల రూపాయలు వస్తే.. ముస్లిమేతరులకు కేవలం 200 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు.