
విగ్రహాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఎన్.సుధాకర్ సీఐ డి.రామాంజనేయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పోలి చెరువు వద్ద ఉన్న శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 17న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. ఇత్తడితో తయారు చేసిన పంచముఖ ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి, వినాయకస్వామి విగ్రహాలను దొంగలించారు. ఈ విషయంపై ఆలయ పురోహితుడు బల్లా వజ్జల సుధీర్‌శర్మ ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రామాంజనేయుడు ఆధ్వర్యంలో వారు దర్యాప్తు చేపట్టారు. కడప నగరానికి చెందిన షేక్ మస్తాన్ అలియాస్ సలీం అలియాస్ దబిడి దిబిడి, సయ్యద్ మస్తాన్‌బాషాను తిరుపతి రహదారిలోని శ్రీఅయ్యప్పస్వామి దేవస్థానం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.50 వేల విలువ చేసే 3 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ గతంలో నందలూరులోని ఆంజనేయస్వామి దేవస్థానంలో వెండి తొడుగు దొంగలించినట్లు కేసు నమోదైంది. ఆ కేసులో కడపలోని సెంట్రటు జైలులో మార్చి వరకు శిక్ష అనుభవించాడు. మస్తాన్ పలు నేరాలలో ముద్దాయిగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.





