
(అక్టోబరు 20- జానమద్ది హనుమచ్ఛాస్త్రి జయంతి)
తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన డాక్టర్ జానమద్ది జయంతి అక్టోబరు 20న. ఈ సందర్భంగా ఆ సారస్వతమూర్తి గురించి క్లుప్తంగా..
తెలుగుభాష పరిరక్షకులుగా ఆంగ్లేయుడు సీపీ బ్రౌన్ అనంత కీర్తిని పొందారు. ఆయన సాహితీ కృషిని డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగు వారికి అందజేశారు. బ్రౌన్ కార్యక్షేత్రమైన భవన శిథిలాలపైనే అపూర్వమైన కానుకగా కడపలో సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ జానమద్దిలో ఆడంబరం కనిపించేది కాదు. ఆయన పేరుగాంచిన సాహితీవేత్త అయినా కూడా తొలి కవిత రాసిన వారితోనైనా డాక్టర్ జానమద్ది ఎంతో ఆప్యాయంగా ఉండి ప్రోత్సహించేవారు. చిన్న సాహితీ సభలకు సైతం సమయానికన్నా ముందే వెళ్లి ఏర్పాట్లు చూసేవారు. కుర్చీలు వేయడానికి కూడా వెనకాడేవారు కాదు.
సారస్వతమూర్తి..
జాతీయ స్థాయిలో తెలుగు కవులు, రచయితలతో ఆత్మీయ అనుబంధం గల ఆయన తెలుగు, ఆంగ్ల, కన్నడ భాషల్లో పలు రచనలను అనువదించారు. స్వయంగా ఎన్నో పుస్తకాలు రచించారు. అటు ప్రాచీన సాహిత్యం, ఇటు అభ్యుదయ సాహిత్యాన్ని ఒకేలా ఆదరించారు. ముఖ్యంగా వైయస్సార్ జిల్లాలోని దాదాపు అందరూ కవులు, రచయితల గురించి పత్రికలలో అక్షరబద్ధం చేశారు. ప్రముఖులపై వేలాది వ్యాసాలు రాశారు. వైయస్సార్ జిల్లాలో పత్రికలకు ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా వ్యాసాలు రాసే ఒరవడికి ఆయనే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. కడప జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా గొప్ప కవులను జిల్లాకు ఆహ్వానించి సభలు ఏర్పాటు చేశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లాలో సాహితీ సభలకు ముఖ్య కేంద్రంగా మార్చారు. విద్వాన్ కట్టా నరసింహులును మానస పుత్రుడిగా అభిమానించి క్లిష్టమైన కడప కైఫీయత్‌లను ఆయన ద్వారా పరిష్కరింపజేసి కీర్తి ప్రతిష్టలు సంతరించిపెట్టారు. సాహిత్యం పట్ల అభిమానం, అభిరుచి ఉన్న వారిని ఎంతో ఆదరించి ఆ రంగం వైపు ప్రోత్సహించారు. తెలుగుభాష, సంస్కృతులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఏ సమాచారం కావాలన్నా ఆయననే సంప్రదించేవారు.
కీర్తి పరిమళం
డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 1925 అక్టోబరు 20న జన్మించారు. కడప జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా గొప్ప కవులను జిల్లాకు ఆహ్వానించి సభలు ఏర్పాటు చేశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లాలో సాహితీ సభలకు ముఖ్య కేంద్రంగా మార్చారు. గ్రంథాలయానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా 2014 అక్టోబరు 20న గ్రంథాలయ ఆవరణలో డాక్టర్ జానమద్ది శిలా విగ్రహాన్ని నాటి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ద్వారా ఆవిష్కరింపజేశారు. 1998లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. ఆయన పేరిట 2012లో కుమారుడు, బ్యాంకు రిటైర్డ్ అధికారి జానమద్ది విజయభాస్కర్ జానమద్ది సాహితీపీఠం ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆ జ్ఞాపకం ఖరీదు అమూల్యం
డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి పీఠం ఆధ్వర్యంలో 2018లో ఆయన మానస పుత్రుడు విద్వాన్ కట్టా నరసింహులుకు ఆయన పేరిట పురస్కారం అందజేశారు. అందులో భాగంగా రూ. 10 వేల చెక్కును అందజేశారు. కానీ కట్టా నరసింహులు ఆ చెక్కును మార్చుకోలేదు. తనకు పితృ సమానుడైన ఆ పవిత్రమూర్తి పేరిట ఇచ్చిన ఆ చెక్కును తాను ఆయన జ్ఞాపకంగా చిరకాలం దాచుకున్నానని విద్వాన్ కట్టా నరసింహులు తెలిపారు. దాన్ని డబ్బుగా మార్చుకుంటే ఖర్చు అయిపోతుందని , ఆయన జ్ఞాపకాలు తనకు లక్షల విలువజేసే నిధిగా భావిస్తూ చెక్కును మార్చుకునే ఆలోచనకు శాశ్వతంగా చెక్ పెట్టానని తెలిపారు. ఆ చెక్కును గొప్ప జ్ఞాపికగా జీవితాంతం అట్టే ఉంచుకున్నారు.
ప్రత్యేక సంచికలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు వీరాభిమానులున్నారు. వారిలో ఒకరైన కొండూరు జనార్దన్‌రాజు ‘జ్ఞాపకాల్లో మన జానమద్ది’ పేరిట ప్రత్యేక సంచికను రూపొందించారు. అందులో జానమద్ది గురించి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ద ప్రతిష్టులైన 120 మంది రచయితలతో వ్యాసాలను ప్రచురించారు. బ్రౌన్ గ్రంథాలయం ఆధ్వర్యంలో అంతకుముందే డాక్టర్ బ్రౌన్ శాస్త్రి గౌరవ సూచికంగా సంస్కృతి పేరిట ప్రత్యేక సంచికలు ప్రచురించారు. ఆయన 2014 ఫిబ్రవరి 28న ఈ లోకాన్ని వీడారు.





