
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డులో గల కోటమ్మ సత్రం వద్ద నూతన మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా దసరా ఉత్సవాల సమయంలో బతుకమ్మను, వినాయక చవితి పర్వదినానికి వినాయక మండపం ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటు నిత్య పూజలు నిర్వహించే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు సరికాదన్నారు. అంతేకాక కోటమ్మ సత్రానికి కూత వేటు దూరంలో కుడివైపున శివాలయం, ఎడమవైపున రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, ఎదురు రోడ్డులో గాంధీ చౌక్ వద్ద విఘ్నేశ్వర ఆలయానికి ఇటు వైపు గుండా భక్తులు వెళుతుంటారన్నారు. కోటమ్మ సత్రం వద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . తక్షణమే జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాల న్నారు. కోటమ్మ సత్రం వద్ద నుంచి సత్తెనపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వరకు మహిళలు ప్రదర్శన నిర్వహించారు. సీఐ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ప్రదర్శనగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ ఎం.హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.





