
తిరుపతి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తిరుమల గిరులలో చర్చి నిర్మాణం జరుగుతోందంటూ తప్పుదారి పట్టించే ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన ముగ్గురు యువకులు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. నిజానికి వారు ఆ ఫోటోలలో చూపించిన శిలువ అటవీ శాఖకు చెందిన ఒక భవనం పై సీసీ కెమెరా అమర్చటం కోసం ఏర్పాటు చెయ్యబడ్డ పోల్ గా పోలీసులు నిర్ధారించారు. ఈ ఫోటోను దూరం నుంచి తీసుకున్నారని, ఓ కోణంలో చూస్తే, ఇది వీక్షకులను సులువుగా తప్పుదోవ పట్టించే అవకాశముందని వారు తెలిపారు.

‘ ఏడు కొండలపై వెలుస్తున్న చర్చిలు’ అనే శీర్షికతో ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కు చెందిన విజిలెన్స్ విభాగం ఆగస్టు 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట పోస్ట్ చేసిన వ్యక్తుల ఐపి అడ్రస్ ను ట్రేస్ చేయడం మొదలుపెట్టి, ఆ ముగ్గురు నిందితులను ట్రాక్ చెయ్యడం తోపాటు, ఫోటోలలో చూపించిన ప్రదేశాన్ని కూడా పోలీసులు సందర్శించి నిజా నిజాలను నిర్ధారించారు. ఆ ముగ్గుర్నీ అరుణ్ కుమార్, కార్తీక్, చక్రవర్తిగా గుర్తించారు. శుక్రవారం తిరుపతి అర్బన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేఎన్ అన్బు రాజన్ విలేఖరులతో మాట్లాడుతూ “సమస్యను సీరియస్ గా తీసుకొని డిజిపి మాకు ఈ సంఘటనను క్షుణ్ణంగా విచారించి, దోషులను గుర్తించాలని ఆదేశించారు. వాస్తవాలను ధ్రువీకరించకుండా కొద్ది మంది ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలపైన తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేశారు. ఆ భవన౦లో ఒక అటవీ శాఖ భవనంపై సిసిటివి కెమెరాని ఫిక్స్ చేయడానికి ఇనుప పోల్ ఏర్పాటు చెయ్యబడివుంది. దానిని దూరం నుంచి ఫోటో తీసి ఒక తప్పుడు వార్తని ప్రచారం చేశారు. అందుకు గాను నిందితులపై ” ఐపీసీ సెక్షన్ 500 (అబద్ధపు), 505 (2) (స్టేట్ మెంట్స్ కండరింగ్ పబ్లిక్ మిస్చీఫ్) కింద కేసు నమోదు చేశాం” అని ఆయన తెలిపారు.
ఏ రూపంలోనైనా తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని యువతను ఎస్పీ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మే లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు టిటిడి అనేక వివాదాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. గత నెలలో తిరుమల తిరుపతిలో బస్సు టికెట్లపై జెరూసలెం యాత్ర, హజ్ యాత్రల ప్రకటన ఒక వివాదాన్ని రగిలించింది. వెనువెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంది. హిందూ దేవాలయాలలో కొలువులలో ఉన్న అన్య మతస్థులు తమకు తాముగా విధుల నుంచి వైదొలగాలని, విజిలెన్సు యొక్క ఆకస్మిక దాడులలో ఎవరైనా అన్య మతావలంబకులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన విషయం పాఠకులు ఎరిగినదే.





