ArticlesNews

విశ్వవ్యాప్తం.. హిందుత్వం చివరి భాగం

5views

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు
విశ్వవ్యాప్తం.. హిందుత్వం 2వ భాగం ఇక్కడ చదవచ్చు
విశ్వవ్యాప్తం.. హిందుత్వం 3 వ భాగం ఇక్కడ చదవచ్చు

హిందుత్వ గురించి తెలుసుకో..!

*       హిందూఫోబియా లేదా హిందూ వ్యతిరేక ద్వేషం అనేది హిందూ అస్తిత్వం, ఆరాధనా పద్ధతులు, దేవీదేవతలు, ధర్మగ్రంథాలు, దేవాలయాలు, చిహ్నాలు లేదా హిందూ సమాజం పట్ల చూపించే పక్షపాతం, అవమానం, ఎగతాళి, తప్పుడు చిత్రీకరణ, వ్యవస్థాగత వివక్ష లేదా హింసాత్మక ద్వేషాన్ని సూచిస్తుంది.

*             హిందువులకు సంబంధించిన ప్రతి విమర్శ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. కానీ, వ్యవస్థాగతమైన అవమానాలను, ద్వంద్వ ప్రమాణాలను సాధారణ విమర్శలుగా అంగీకరించడం కూడా తప్పే అవుతుంది.

*           ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా సుమారు 120 కోట్లు. దీని అర్థం హిందూ సమాజం ఇకపై కేవలం భారతదేశానికే పరిమితమైన ధార్మిక-సాంస్కృతిక సమాజం మాత్రమే కాదు. అది ప్రపంచవ్యాప్త ఉనికిని కలిగిన ఒక శక్తిమంతమైన, ప్రభావవంతమైన నాగరిక సమాజంగా కూడా అవతరించింది. అందువల్ల, హిందూ అస్తిత్వం, హిందుత్వ చుట్టూ ఉన్న చర్చను సమగ్రంగా అర్థం చేసుకోవడం, సమాధానం ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే దాని ప్రభావం భారతదేశ సరిహద్దులను దాటి విస్తరించి ఉంది కాబట్టి.

*             ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం అనేది భారతీయ నాగరికత సంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆమోదానికి నిదర్శనం. ఆరోగ్యం, సమతుల్యత, స్వీయ-క్రమశిక్షణ కోసం యోగాను ప్రపంచం ఒక విశ్వవ్యాప్త ఆచరణగా స్వీకరించింది. హిందూ విశ్వాసం,  సంప్రదాయంలో తప్ప ఇటువంటి విశ్వజనీనత, “సర్వే భవంతు సుఖినః” (అందరూ సుఖంగా ఉండాలి) అనే భావన మరెక్కడా కనిపించదు గాక కనిపించదు.

*             భారతదేశం అధ్యక్షత వహించిన జి`20 సదస్సుకు ఇతివృత్తంగా “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” (One Earth, One Family, One Future) ఉంది. ఇది “వసుధైవ కుటుంబకం” అనే భారతీయ భావన నుండి ప్రేరణ పొందినది. నేటి ప్రపంచ దౌత్యరంగంలో భారతీయ నాగరికతా భావనలకు లభిస్తున్న స్థానానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

*             అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలలో భారతీయ మూలాలున్న ప్రజల సంఖ్య పెరుగుతుండటంతో, హిందూ అస్తిత్వానికి సంబంధించిన చర్చ ఇకపై కేవలం భారతదేశ అంతర్గత చర్చలకే పరిమితం కాలేదు. విదేశాలలో స్థిరపడిన హిందూ సమాజం దేవాలయాలు, పండుగలు, భాష, కుటుంబ వ్యవస్థలు, యోగా, భారతీయ వంటకాల సంస్కృతి ద్వారా తన అస్తిత్వాన్ని బహిరంగంగా చాటుకుంటోంది.

*           అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారతీయ మూలాల ప్రజల జనాభా 50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అక్కడ అత్యంత విద్యావంతులుగా, ఆర్థికంగా విజయవంతమైన వలస సమూహాలలో వీరు కూడా ఉన్నారు. తత్ఫలితంగా అమెరికా విశ్వవిద్యాలయాలు, మీడియా, చట్టసభలలో హిందూ అస్తిత్వంపై జరుగుతున్న చర్చలు ఈ వర్గంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి.

*             హిందూ సమాజంపై జరిగే విమర్శలలో కుల వ్యవస్థకు సంబంధించిన అంశం తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. దీనిని కాదనడం సమంజసం కాదు. అయితే హిందూ సమాజంలోనే స్వీయసంస్కరణకు సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుద్ధుడు, కబీర్‌దాస్, సంత్ రవిదాస్, చైతన్యప్రభు, నారాయణగురు, స్వామి దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయులు బలమైన సామాజిక సంస్కరణ సంప్రదాయాన్ని నెలకొల్పారు.

*             నేడు మహానగరాలలో, మెట్రోలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లోనూ, హోటళ్లు, ఆసుపత్రుల్లోనూ, అలాగే బహిరంగ తాగునీటి కేంద్రాలు, యాత్రికుల విశ్రాంతి గృహాలు, దేవాలయాల్లోనూ కుల వ్యవస్థకు సంబంధించిన రుగ్మత, వైపరీత్యం కనుమరుగయ్యాయి.

*           భారతీయ సంప్రదాయంలో ఆత్మవిమర్శ, చర్చ, తత్వచింతన, సంస్కరణ,  సామాజిక పునర్నిర్మాణాల అవిచ్ఛిన్న ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి భారతీయ సంప్రదాయమే హిందూ సంప్రదాయంగా విరాజిల్లుతున్నది.

అమృతవాక్కులు

హిందుత్వం అనేది కేవలం ఒక పదం కాదు. అది ఒక  ఇతిహాసం. హిందూ సమాజ నిర్మాణానికి ఉపకరించిన సమస్త సాంస్కృతిక, సామాజిక, జాతీయవాద తత్వాల సమ్మేళనమే హిందుత్వం.

 – స్వాతంత్య్రవీర సావర్కర్ (హూ ఈజ్ ఏ హిందూ పుస్తకం నుంచి)

హిందుత్వం అనేది ఒక సంప్రదాయనికి పెట్టిన పేరు కాదు. అది భారతదేశపు ఆత్మ. భారతదేశపు సాంస్కృతిక వ్యక్తిత్వం, ఐతిహాసిక అనుభవాల వ్యక్తీకరణే హిందుత్వం.

– బిపిన్ చంద్రపాల్, స్వాతంత్య్ర సేనాని, పాత్రికేయులు (ద సోల్ ఆఫ్ ఇండియా పుస్తకం నుంచి)

మన జాతీయతకు సనాతనధర్మమే ఆధారం. భారతీయ జీవనం, ఆత్మ ఈ ధర్మంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. భారత్ భవిష్యత్తుకు అవసరమైన శక్తి కూడా దీని నుంచే లభ్యమవుతుంది.

– మహర్షి అరవింద్, ప్రసిద్ధ దార్శనికులు (1909లో చేసిన ప్రసంగం నుంచి)

హిందూ ధర్మం, దాని తత్వ వికాసం ఎప్పటికప్పుడు సాధువులు, ధార్మిక సంస్కర్తలు హిందూ భావధార, ఆచారాల నుండి అవినీతి, మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నించారని, ఆ ప్రయత్నం శాఖల ఏర్పాటుకు దారితీసింది. బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించారు. మహావీరుడు జైనమతాన్ని స్థాపించారు. బసవుడు లింగాయత స్థాపకుడయ్యారు. జ్ఞానేశ్వర్, తుకారాం వార్‌కారి సంప్రదాయాన్ని ప్రారంభించారు. గురునానక్ సిక్కుమతానికి స్ఫూర్తినిచ్చారు. దయానంద ఆర్య సమాజాన్ని స్థాపించారు.చైతన్యుడు భక్తి సంప్రదాయాన్ని ప్రారంభించారు. రామకృష్ణ, వివేకానందుల బోధనల ఫలితంగా, హిందూ ధర్మం దాని అత్యంత ఆకర్షణీయమైన ప్రగతిశీల, గతిశీల రూపంలో వికసించింది. మనం వారి వారి అభిప్రాయాలలో కొంత భిన్నత్వాన్ని గమనిస్తాము. కానీ ఆ భిన్నత్వంలో ఒక రకమైన సూక్ష్మమైన, వర్ణించలేని ఐక్యత ఉంది. అది వారిని విశాలమైన, హిందూ ధర్మం పరిధిలోనే ఉంచుతుంది.

 –  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత ద్వితీయ రాష్ట్రపతి

‘పాంచజన్య’ నుంచి

అనువాదం: మహేష్ ధూళిపాళ్ళ