ArticlesNews

హిందూ ధర్మంపై ‘విద్వేషపు’ పడగ

3views

సమాజంలో ‘భావప్రకటన స్వేచ్ఛ’ ముసుగులో హిందూధర్మం, దేవతలపై ప్రణాళిక ప్రకారం కుట్రపన్ని విద్వేషాన్ని చిమ్ముతున్నారు. కొందరు విద్రోహశక్తులు భారతదేశాన్ని, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను తమ విభజనవాద రాజకీయాలకు ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. ఆ ద్రోహశక్తుల అసలు స్వరూపాన్ని ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలు బట్టబయలు చేస్తున్నాయి.

సామాజిక న్యాయం అనే పదాన్ని అడ్డం పెట్టుకుని, సమాజంలో వైషమ్యాలు సృష్టించే కుటిల ప్రయత్నాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఏలూరులో ‘దళిత క్రైస్తవ శంఖారావం’ పేరిట నిర్వహించిన బహిరంగసభ ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సభలో న్యాయవాది జడ శ్రావణ్, యూట్యూబర్ బచలకూరి జోసెఫ్ (ప్రశ్న రావణ్) తదితరులు హిందూ మతంపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో విద్వేషం వెళ్లగక్కారు. గతంలో హిందూధర్మాన్ని విమర్శించినందుకు దేవాలయాల కూల్చివేత తదితర ఘటనల్లో ఖండించి, ప్రశ్నించి, విమర్శించిన డిప్యూటీ సీ¾ఎం పవన్‌కల్యాణ్, డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజులను దూషిస్తూ, హిందూదేవతలను అవమానపరుస్తూ, ద్వేషిస్తూ ఈ వేదిక నుంచే వారు అసభ్యకరమైన పదాలతో తీవ్రంగా దూషించారు. క్రైస్తవ వేదికలను ఏర్పాటు చేసుకున్నది ఆయా వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడటానికి కాగా, అందుకు భిన్నంగా, కేవలం హిందూ దేవతలను తూలనాడ టానికి, కించపరచడానికే వేదికను ఉపయోగించు కోవడం సభ్యసమాజం తలదించుకునే చర్య. తమ మాటలు ఆలకించేవారిని హిందూమతంపై ఉసిగొలిపి, ఈర్ష్యాద్వేషాలు రగిలించి, సమాజంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి ధనం, రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా ఇలాంటి వేదికలు ఏర్పాటయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, మతమార్పిడుల వెనుక ఉన్న అసలు కుట్రలను, మత రాజ్యాలుగా మారితే సమాజం ఎదుర్కొనే దారుణమైన దుష్పరిణామాలను, అన్నింటినీ భరించే హిందూ ధర్మం విశిష్టతను లోతుగా విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను, హిందూ మతం కల్పిస్తున్న స్వేచ్ఛ, మత ఆధారిత దేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు లేని ప్రాధాన్యతలు, మతాన్ని విమర్శిస్తే ఎదుర్కొంటున్న పర్యవసానాలు, హిందూమతం గొప్పతనం గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్, పార్టీ ప్యానలిస్టులు, అధికార ప్రతినిధుల సమావేశంలో వివరించారు.

మత రాజ్యాల అసలు స్వరూపం – కోల్పోయే హక్కులు

దళిత హక్కుల పరిరక్షణ పేరుతో, సామాజిక న్యాయం సాధిస్తామనే భ్రమలతో హిందూధర్మాన్ని వీడి ఇతర మతాలవైపు ఆకర్షితులవుతున్న వారు ఒక కఠోరమైన, చేదు చారిత్రక సత్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యాలు, దేశాల్లో బహుజనులకు, దళితులకు, అల్పసంఖ్యాక వర్గాలకు కనీస మానవ హక్కులు కూడా మృగ్యమయ్యాయన్నది నగ్న సత్యం. మత రాజ్యంలో ‘ఒకే మతం, ఒకే చట్టం’ అనే నిరంకుశత్వం రాజ్యమేలుతుంది. అక్కడ భిన్నత్వానికి, సామాజిక సమానత్వానికి ఏమాత్రం తావుండదు. బాంగ్లాదేశ్, పాకిస్తాన్‌లాంటి ఇస్లామిక్ మత రాజ్యాల్లో దళితులు, ఎస్సీ,ఎస్టీలకు ఎలాంటి రాజ్యాంగ పరమైన హక్కులూ లేవు. మన దేశంలోలా అక్కడ అణగారిన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు (అట్రాసిటీ చట్టం వంటివి) గానీ, సామాజిక అభ్యున్నతి కోసం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు గానీ లేవు. వారు అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంటూ, కనీస గౌరవానికి నోచుకోక వారి బతుకులు దినదిన గండంగా, కన్నీటి గాథలుగా మారాయి. ఇతర దేశాల్లోనే కాదు… మన దేశంలోనే ఆర్టికల్ 370 రద్దు కాకముందు మత ఛాందసవాదం కోరల్లో చిక్కుకున్న జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ దశాబ్దాల పాటు ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టాలు అమలు కాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అక్కడి గిరిజన సామాజిక వర్గానికి, ఇతర దళితులకు కనీస పౌరసత్వ హక్కులు, స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందలేదు. ఇది మత ఛాందసవాదం అణగారిన వర్గాలకు చేసే ద్రోహానికి ఒక మాయని మచ్చ. మతాధారిత రాజ్యం ఏర్పడినప్పుడు, అక్కడ ముందుగా ప్రభావితమయ్యేవి భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వపు హక్కులే. నిలదీసి, విమర్శించే స్వేచ్ఛ అక్కడ ఎంతమాత్రం ఉండదు. నేడు భారతదేశంలో పౌర హక్కులు రాజ్యాంగబద్ధంగా లభిస్తున్నాయి. అంటే, దానికి ఏకైక కారణం ఈ నేలకున్న విశాలమైన, సర్వమత సహనంతో కూడిన “హిందూత్వ” జీవనాడి. అందరినీ కలుపుకుపోయే సనాతన ధర్మం బలంగా ఉండటం వల్లే లౌకికవాదం, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నాయి. ఆ ధార్మిక జీవనాడిని విచ్ఛిన్నం చేస్తే, మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం పూర్తిగా ఆవిరైపోయి చీకటి యుగంలోకి జారుకుంటాం.

దేవుడినే ప్రశ్నించే స్వేచ్ఛ..

మత రాజ్యాలు, నిరంకుశ సిద్ధాంతాలు సృష్టించిన మారణహోమాలు, అణచివేతలు కోకొల్లలు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. యజిడీలు, ఆఫ్ఘనీలు, అహ్మదీలు వంటి చిన్న చిన్న సమూహాలపై, భిన్నమైన నమ్మకాలు ఉన్నవారిపై కనీస కనికరం లేకుండా మారణకాండ సాగించి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. అంతెందుకు 1900 నుండి 2026 వరకు గమనిస్తే, అబ్రహామిక్ మతాలైన ఇస్లాం, క్రైస్తవాల్లో దేవుడిని, మత గ్రంథాలను లేదా వారిలోని మూఢవిశ్వాసాలను ప్రశ్నించడం చాలా తీవ్రమైన నేరంగా పరిగణించే వారు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో ఈ పరిస్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ‘బ్లాస్ఫెమీ’ (దైవదూషణ) చట్టాల పేరిట ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టడం, బహిరంగంగా కొరడాలతో కొట్టడం, మరణశిక్షలు అమలుచేయడం చూశాం. “ది సాటానిక్ వర్సెస” రాసినందుకు సల్మాన్ రష్దీపై ఫత్వా జారీ కావడం,ఆయన ప్రాణాపాయ దాడికి గురికావడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే మతమౌఢ్యాన్ని ప్రశ్నించిన బాంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను దేశ బహిష్కరణ చేయడం, సౌదీ అరేబియాలో బ్లాగర్ రయీఫ్ బదావికి పదేళ్ల జైలుశిక్షతో పాటు కొరడా దెబ్బలు విధించడం మతపరమైన శిక్షలకు కొన్ని నిదర్శనాలు. కైస్తవమతంలో కూడా 20వ శతాబ్దపు మొదటి సగంలో మతవిశ్వాసాలను, సృష్టి సిద్ధాంతాలను ప్రశ్నించిన ఎందరో శాస్త్రవేత్తలను, హేతువాదులను చర్చి నుండి వెలివేశారు. వారి రచనలను నిషేధిత పుస్తకాల జాబితాలో చేర్చారు. కాలక్రమేణా చట్టపరమైన మరణశిక్షలు తగ్గినప్పటికీ, మతపెద్దల నుండి తీవ్ర సామాజిక బహిష్కరణలు, మానసిక వేధింపులు కొనసాగాయి. మిగతా ధర్మాలన్నీ కట్టుబాట్లకు లోబడి ఉంటాయి. ఒకేమార్గంలో నడవాలని శాసిస్తాయి. వారి ప్రవక్తను గానీ, దేవుడిని గానీ, పుస్తకాన్నిగానీ ప్రశ్నిస్తే సమాజం నుండి వెలివేస్తారు, దారుణమైన శిక్షలు విధిస్తారు. కానీ హిందూమతం విమర్శలను సైతం భరించి, క్షమించి, నాస్తికులను సైతం తనలో కలుపుకునే అత్యంత విశాలమైన సహిష్ణుతగల ధర్మం. విమర్శను ఒక దీవెనగా భావించి తన్ను తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకునే శక్తి ఈ ధర్మానికి ఉంది. ఈ అంశాన్ని ఉదహరిస్తూ మాధవ్ ఒక సంఘటనను గుర్తుచేశారు. తాను స్వాతంత్య్ర సమరవీరుడు వీర సావర్కర్ పుస్తకం చదివానని, అందులో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధం స్వీకరించే సమయంలో సావర్కర్ స్వయంగా రాసిన లేఖలోని అక్షర సత్యాలను ఇలా వివరించారు. “మిత్రమా! మతం మారే నిర్ణయంవల్ల నువ్వు బందీవి కాబోతున్నావు. నీ స్వేచ్ఛను కోల్పోతున్నావు. దేవుడు ఉన్నాడా? లేడా? అని తన దేవుడినే నేరుగా ప్రశ్నించే అధికారం, తాను ఎంచుకున్న మార్గాన్ని విమర్శించే అవకాశం, విగ్రహారాధన ఉన్నా, లేకున్నా… ఏ రకమైన ఆలోచనా విధానాన్నైనా అత్యంత స్వేచ్ఛగా చెప్పగలిగే అవకాశం కేవలం ఈ హిందూ ధర్మంలోనే ఉంది. ప్రపంచంలో ఇంకే ధర్మంలోనూ ఈ స్వేచ్ఛ లేదు. మిగతా ధర్మాలన్నీ కట్టుబాట్లకు లోబడి ఉంటాయి. ఒకే మార్గంలో నడవాలని శాసిస్తాయి’ అని తెలిపారు.

పీఓకేలో పాకిస్తాన్ దాడులు:అరాచక పాలన

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సాగిస్తున్న అరాచకాలు ఒక మతరాజ్యం చేసే దారుణాలకు సజీవసాక్ష్యం. దశాబ్దాలుగా పీఓకే ప్రజలు కనీస మానవ హక్కులు, స్వేచ్ఛ లేకుండా పాక్ సైన్యం చేతిలో బానిసలుగా బతుకు తున్నారు. పాకిస్తాన్ సహజ వనరులను విపరీతంగా దోచు కుంటూ, స్థానికులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదు. తమ న్యాయమైన హక్కులకోసం, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే స్థానిక ప్రజలపై పాక్‌సైన్యం అత్యంత దారుణంగా లాఠీచార్జీలు, తూటాలతో దాడులు జరుపుతూ నెత్తుటేరులు పారిస్తోంది. అక్కడ ప్రశ్నించే నాయకులను అక్రమంగా అరెస్టులుచేసి, కిడ్నాప్‌లకు పాల్పడు తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పీఓకే ప్రజలు పాకిస్తాన్ క్రూరత్వానికి బలవుతూ, తమ మనుగడకోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు.

కమ్యూనిజం పేరుతో మతాన్ని పూర్తిగా నిషేధించిన చైనాలో మావో జిడాంగ్ హయాంలో జరిగిన ‘సాంస్కృతిక విప్లవం’లో కోట్లాదిమంది అమాయకులను క్రూరంగా ఊచకోత కోశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు, కనీస మానవ హక్కులు అక్కడ బూతద్దంపెట్టి వెతికినా కనిపించవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా జైలు పాలవ్వడం లేదా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. కోవిడ్ లాంటి ప్రపంచ మహమ్మారి పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా, దానిపై ప్రపంచానికి వాస్తవాలు చెప్పే స్వేచ్ఛ అక్కడి పౌరులకుగానీ, పత్రికలకుగానీ, వైద్యులకుగానీ లేకుండా వారిగొంతు నొక్కేశారు. కానీ, భారత దేశంలో మాత్రం అత్యున్నత ప్రజాస్వామ్య స్వేచ్ఛను అనుభవిస్తున్న కమ్యూనిస్టులు, దళితవాదులు… చైనాను, హిడ్మా లాంటి రక్తపిపాసులైన మావోయిస్టులను కీర్తిస్తూ, దేశ, సమాజ విచ్ఛిన్న విభజన ఎజెండాలు నడుపుతుంటారు. ఇక్కడ వారు అనుభవిస్తున్న భావప్రకటన స్వేచ్ఛ చైనాలో ఉంటే వారి పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.

 మత రాజ్యాల దారుణాలు… భరతమాత ఆశ్రయం

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా మతహింసకు గురై, ప్రాణభయంతో వచ్చిన ఎన్నో అల్పసంఖ్యాక వర్గాలకు ఆశ్రయం ఇచ్చిన ఏకైక దేశం మనది. ప్రపంచమంతా యూదులను అకారణంగా ద్వేషించి, ఊచకోత కోసిన చరిత్ర ఉంది. కానీ, యూదులు ఇక్కడ ఎలాంటి వివక్ష లేకుండా, ఏ మతమార్పిడి ఒత్తిడులకు గురికాకుండా వందల ఏళ్లు ప్రశాంతంగా తలదాచుకున్నారు. వారు తిరిగి పూర్తి స్వాభిమానంతో ఇజ్రాయెల్ దేశాన్ని నిర్మించుకునే వరకు భారత్ వారికి ఒక రక్షణ కవచంలా నిలిచింది. అలాగే, ఇస్లామిక్ దాడుల వల్ల, మత ఛాందసవాదుల క్రూరత్వానికి బలైపోయి పర్షియా (నేటి ఇరాన్) నుండి ప్రాణభయంతో సముద్రం మీదుగా గుజరాత్ తీరానికి చేరుకున్న పార్శీలను (జొరాస్ట్రియన్లను) అక్కున చేర్చుకున్న ఘనత ఈ దేశానిది. పాలల్లో చక్కెరలా ఈ సమాజంలో కలిసిపోతామన్న వారిని నాటి హిందూ రాజులు సొంత బిడ్డల్లా ఆదరించారు. వారి మతాచారాలకు, అగ్ని దేవాలయాలకు పూర్తి రక్షణ కల్పించి, అత్యంత గౌరవప్రదంగా జీవించే హక్కును ప్రసాదించిన ఘనత కేవలం హిందూ ధర్మానికే దక్కుతుంది. భిన్నత్వాన్ని గౌరవించి, విమర్శలను సైతం స్వీకరించే సనాతన ధర్మం వల్లే ఇదంతా సాధ్యమైంది.

తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్