హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు: ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలి : గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ

న్యూఢిల్లీ: హిందూ దేవతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (GAC) యూట్యూబ్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఈ వీడియో హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కమిటీ అభిప్రాయపడింది.
ధ్రువ్ రాఠీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2026 మార్చి 21న “Can Hindus Eat Beef?: Debunking The Kerala Story 2” అనే శీర్షికతో 21 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. ఇందులో హిందువుల ఆహారపు అలవాట్లు, ప్రాచీన గ్రంథాలు, రామాయణం, మహాభారతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండవులు వనవాస సమయంలో మాంసాహారం, మద్యం సేవించారని పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజంలో అభ్యంతరాలకు దారితీశాయి.
ఈ వీడియోపై న్యాయవాది అమితా సచ్‌దేవా 2026 మార్చి 22న న్యూఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేయగా, మార్చి 23న యూట్యూబ్ గ్రీవెన్స్ అధికారికీ కూడా ఫిర్యాదు సమర్పించారు. అయితే, వీడియో భారత చట్టాలు లేదా యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని పేర్కొంటూ యూట్యూబ్ మార్చి 25న ఫిర్యాదును తిరస్కరించింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించిందని భావిస్తే కోర్టు లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని సూచించింది.
దీంతో అమితా సచ్‌దేవా మార్చి 27న గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి అప్పీల్ చేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, జూలై 3న ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుని 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కమిటీని ఆదేశించింది.
వీడియోను పరిశీలించిన అనంతరం, అది ఒక వర్గం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే అవకాశం ఉందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ 24 గంటల్లో వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, ధ్రువ్ రాఠీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ అమితా సచ్‌దేవా సాకేత్ మేజిస్ట్రేట్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండగా, తదుపరి విచారణను 2026 సెప్టెంబర్ 10కు నిర్ణయించారు.
ఈ సందర్భంగా అమితా సచ్‌దేవా స్పందిస్తూ, మత విశ్వాసాలను అవమానించే కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద వీడియోలు లక్షలాది మందికి చేరిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ఇలాంటి కేసుల్లో త్వరితగతిన నిర్ణయాలు రావడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.





