News

సొమ్ము నెల్లూరు ప్రజలది, సోకు వక్ఫ్ బోర్డుది – కరణం భాస్కర్

177views

రొట్టెల పండుగ పేరుతో నెల్లూరులోని బారా షహీద్ దర్గా కు సంబంధించి కోట్లాది రూపాయలను నెల్లూరు కార్పొరేషన్ వారు వృధాగా ఖర్చు చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ నాయకులు శ్రీ కరణం భాస్కర్ ఆరోపించారు. కార్పొరేషన్ నిధులను కార్పొరేషన్ అభివృద్ధికి, సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు చేయాలి తప్ప ఇలా పండుగలు, పబ్బాల పేరుతో దుబారా చేయరాదని శ్రీ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

రొట్టెల పండుగ పేరుతో కార్పొరేషన్ అధికారులు ప్రతి ఏటా సుమారు ఒకటిన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని భాస్కర్ తెలిపారు. హిందువులకు సంబంధించిన గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా కార్పొరేషన్లు ఇలా ఖర్చు చేయలేదని, వాటికి ఆయన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరించిందని శ్రీ భాస్కర్ తెలిపారు.

నిజానికి రొట్టెల పండుగను గత ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్ణయం చేసిందని కనుక దానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి వెచ్చించాలి తప్ప కార్పొరేషన్ నిధుల నుంచి వెచ్చించడం తగదని ఆయన అన్నారు.

రొట్టెల పండుగ జరిగే ప్రాంతమంతా చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారని, ఆయా వ్యాపారాలకు వక్ఫ్ బోర్డు వారు టెండర్లు పిలిచారని, ఒక కాంట్రాక్టర్ సుమారు 70 లక్షల రూపాయలకు టెండరు దక్కించుకున్నారని, ఇవి కాక హుండీల ద్వారా మరో కోటి రూపాయల వరకు వక్ఫ్ బోర్డుకు ఆదాయం సమకూరుతుందని, ఈ మొత్తం సొమ్మును వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటుండగా ఖర్చు మాత్రం కార్పొరేషన్ ఎందుకు భరించాలని శ్రీ భాస్కర్ ప్రశ్నించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా సొమ్ము వక్ఫ్ బోర్డుకి, ఖర్చు మాత్రం నెల్లూరు ప్రజలకి అన్నట్టుగా తయారయిందని, దీనిపైన ప్రజలు ఎవరైనా కోర్టుకు వెళితే అధికారులు ఏం సమాధానం చెబుతారని శ్రీ భాస్కర్ ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు ఇక అయినా కళ్ళు తెరిచి కార్పొరేషన్ నిధులు దుబారా కాకుండా చూడాలని శ్రీ కరణం భాస్కర్ విన్నవించుకుంటున్నారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.