News

భోజ్‌శాలపై ముస్లింల పిటిషన్‌.. శుక్రవారం విచారిస్తామన్న సుప్రీం

4views

మధ్యప్రదేశ్లోని భోజ్ శాల ఆలయ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ స్థలానికి సుమారు 2కి.మీ. దూరంలో మసీదుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిందని ముస్లిం పక్షం వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. భోజ్శాలకు దగ్గర్లోనే స్థలాన్ని కేటాయించాలని గతంలో కోర్టు చెప్పినప్పటికీ.. దూరంలో ఎంపిక చేశారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వాస్తవ ప్రదేశానికి 900మీటర్ల దూరంలోనే ప్రార్థనల కోసం ముస్లింలకు స్థలం గుర్తించినట్లు వెల్లడించారు.

అయితే భోజ్ శాలకు సమీపంలో ముస్లింల కోసం ప్రత్యేక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేయవచ్చా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సూచనలు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి వివరాలు చెబుతానని ధర్మాసనానికి వెల్లడించారు. కాగా భోజ్శాల వివాదంపై తుది తీర్పు వెలువడే వరకు.. శుక్రవారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వివాదాస్పద స్థలానికి ఆనుకుని ఉన్న బహిరంగ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.