ArticlesNews

సమ సమాజ నిర్మాణ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

335views

(ఏప్రిల్ 11 – జ్యోతిరావు ఫూలే జయంతి)

తరతరాల అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఫూలే తన జీవితాన్ని అంకితం చేశారు. సమాజం విద్యాపరంగా ఎదిగినప్పుడే అభివృద్ధి చెందుతుందని కాంక్షించిన దూరదృష్టి కలిగిన సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేక పోరాటమే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగా బహుజనులను చైతన్య పరచిన సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక వ్యవసాయ తోటమాలి కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఫూలే తండ్రి పెంపకంలో పెరిగారు.

ఫూలే తన ప్రాథమిక విద్యను 1834 నుంచి 38 మధ్య కాలంలో పూర్తి చేశాడు. అనంతరం చదువును ఆపేశాడు. పాఠశాల చదువు తక్కువైనప్పటికీ పుస్తక పఠనం పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. రాత్రులు లాంతరు వెలుతురులో చదువుకునేవారు. చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు ఆయన్ను 1841లో స్కాటిష్ మిషన్ స్కూల్‌లో చేర్పించారు. అక్కడ బిల్లాల్ గోవింద్‌తో ఫూలేకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే జ్యోతిరావ్‌ను భారతదేశ సామాజిక తత్వవేత్తగా అవతరించేందుకు అంకురం వేసింది. 1848లో గోవింద్ వివాహానికి హాజరైన ఫూలే అక్కడ కుల వివక్షను ఎదుర్కొన్నాడు. ఆ క్షణం నుంచే కులవివక్షపై పోరాడాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు.

అట్టడుగు వర్గాల చైతన్యానికి విద్య ఒక్కటే ఆయుధమని గుర్తించిన జ్యోతిబా అనేక పాఠశాలలను స్థాపించారు. సమ సమాజ నిర్మాణం జరగాలన్నా, సాంఘీక రుగ్మతలను పారద్రోలాలన్నా ప్రజలకు అక్షరజ్ఞానం ముఖ్యమని అవగాహన కల్పించారు. అశేష జనావళికి కుల, మత, లింగ వివక్ష లేకుండా జ్ఞాన వెలుగులను అందించారు. అలాగే సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎనలేనిదని గుర్తించిన జ్యోతి బా వారి వికాసం కోసం కృషి చేశారు. స్త్రీలకు, బాలికలకు పాఠశాలలు స్థాపించారు. నిరక్షరాసురాలు అయిన తన భార్య సావిత్రి బాయికు గురువై అక్షర జ్ఞానం అందించి ఆమెను ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దారు. కేవలం విద్య మాత్రమే కాకుండా బడి మానేసిన పిల్లల కోసం భోజన గృహ వసతి కల్పించారు. సమాజంలో నిరాదరణకు గురైన మహిళలకు అండగా నిలబడ్డారు.

జ్యోతిబా ఫూలే కేవలం నిమ్న వర్గాల వారి కోసం కాకుండా అన్ని వర్గాల వారి కోసం ఉద్యమించారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. ఆనాటి సమాజాన్ని చైతన్యపరుస్తూ ఎన్నో కవితలు, పద్యాలు, జానపదగేయాలు రచించారు. ఒక మానవతావాదిగా సతీసహగమనం, బాల్యవివాహాలను వ్యతిరేకించారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సమానమైన హక్కులు ఉంటాయని సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే అని ఆ దిశగా సమాజాన్ని అక్షరాల దారుల్లో నడిపిన మహామహోపాధ్యాయుడు జ్యోతీరావ్ ఫూలే. తమ కోసం కాకుండా సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల్లో అగ్రగణ్యులు జ్యోతిబా. 1890 నవంబరు 28న పరమపదించిన ఆయన తన జీవన పర్యంతం సామాజిక న్యాయం కోసమే ఉద్యమించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా ఆయన జయంతుత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అయితే అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం దిశగా కృషి చేయడమే ఈ సామాజిక సమతా ఉద్యమకారుడికి మనం అందించే కానుక. ఆయన కోరుకున్నది కూడా ఇదే..