
నవ నారసింహ క్షేత్రాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ నిత్య పూజలతో స్వామివారు వెలుగొందుతున్నారు. లోక కంఠకుడైన హిరణ్య కశ్యుపుని తన చేతి గోళ్లతో సంహరిస్తున్నట్లుగా ఇక్కడి మూలవిరాట్ ఉంటుంది. తన భక్తుడు భక్త ప్రహ్లాదుడితో సమేతంగా ఉన్న నరసింహస్వామి దర్శనం ఇక్కడ తప్పా దేశంలో మరెక్కడా లేదు. స్వామి మూలవిరాట్‌కు ఎడమ భాగాన ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం గమనించవచ్చు.
భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం అని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు చెబుతున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం దేశంలోనే ఎక్కడా లేదని పురాణాలూ చెబుతున్నాయి. పక్షం(15) రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కూడా కదిరిలో మాత్రమే. ఇక్కడి మూలవిరాట్‌లో దైవ రహస్యం దాగుందని భక్తుల నమ్మకం. మూలవిరాట్‌కు అర్చకులు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అది స్వామి వారి జన్మనక్షత్రం. ఆ రోజు అభిషేకం చేసిన తర్వాత మూలవిరాట్ నాభి నుంచి స్వేదం వస్తుంటుంది. ఆ స్వేదం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినప్పటికీ మళ్లీ రావడం గమనార్హం. ఈ దృశ్యాన్ని ఆలయ అర్చకులు అభిషేకానికి హాజరైన భక్తులకు చూపిస్తుంటారు. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికి ఇదే ప్రబల నిదర్శనమని భక్తుల నమ్మకం. ఇక్కడి గర్భ గుడిలోని మూలవిరాట్‌కు ఫొటోలు తీయడం నిషేధం.





