News

నషీన్‌‌‌లో అతి పురాతన ఆలయ ఆనవాళ్లు

209views

అన్వేషించే కొద్దీ వెలికి వస్తుంది భారతీయ గత వైభవం. కట్నీ జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలోనే పొలాల మధ్య కొద్దికాలంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల పని చేస్తున్నది భారత పురావస్తు శాఖ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నషీన్ అనే ఆ చిన్న గ్రామం త్వరలోనే దేశం దృష్టిలో పడుతుంది కూడా. అక్కడి ఒక దిబ్బను పొరలు పొరలుగా తవ్వకుంటూ వెళితే కొన్ని అవశేషాలు బయటపడుతున్నాయి. అక్కడ అసలు భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది అని చెప్పదగిన ఆలయం ఉండవచ్చునని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న నషీన్ గ్రామానికి కాస్త అవతలే గుప్తుల కాలం నాటి పార్వతీమాత ఆలయం, ఈ ఆలయానికి సమీపంలోనే చౌముఖి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. పైగా ఈ మూడు ప్రాంతాలు కూడా ప్రపంచ ప్రఖ్యాత ఖజురాహో ఆలయానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.

‘ఇక్కడ భారతదేశంలోనే అత్యంత పురాతనకాలంలో నిర్మించిన ఆలయం కోసం తవ్వకాలు సాగిస్తున్నా’మని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న శివకాంత్ బాజ్పేయి చెప్పారు. ప్రస్తుతం భూమి పొరలలో కప్పడిపోయిన ఆలయం కూడా గుప్తుల యుగానికి కాస్త ముందు కాలానిది కావచ్చునని తాము భావిస్తున్నామని బాజ్పేయి వెల్లడించారు. ఈ ప్రాంతం ప్రాధాన్యం బట్టి చాలా జాగ్రత్తగా నిశితంగా తవ్వకాలు జరుపుతున్నట్టు కూడా ఆయన చెప్పారు.

నిజానికి నషీన్ గ్రామం మీద 19వ శతాబ్దం నుంచే పురావస్తు శాస్త్రవేత్తల దృష్టి ఉంది. అక్కడ తవ్వకాలు జరిపితే గొప్ప నాగరికత అవశేషాలు బయటపడడం తథ్యమన్న నమ్మకం కూడా ఆనాటి నుంచే ఉంది. ఆ కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అక్కడ తవ్వకాలు జరిపించాడు. ఎందుకంటే అక్కడ ఉన్న పార్వతి మాత ఆలయాన్ని బట్టి చుట్టుపక్కల కూడా సాంస్కృతికను తెలియచెప్పే కట్టడాలు ఉంటాయని వారు విశ్వసించారు.