
పవర్ పేట (ఏలూరు) రైల్వే స్టేషన్లో ఓ 10 మంది సత్యాగ్రహుల్ని – ఇద్దరిద్దరికి కలిపి చేతులకు సంకెళ్లు వేసి – రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లటం కోసం పోలీసులు తీసుకువచ్చారు. ట్రెయిన్ రావటానికి ఇంకా సమయం ఉంది.
ఇరవయ్యేళ్ల వయసున్న ఒక యువతి నెలల పసికందుని భుజం మీద వేసుకుని, చీరకొంగు భుజంమీదుగా కప్పుకొని, ఆదరాబాదరాగా ఒక పనిమనిషి సాయంతో ఆ స్టేషన్లోకి అడుగుపెట్టింది. కంగారు, ఆదుర్దా, ఆరాటం తరుముతుంటే ప్లాట్ఫారమ్ అంతా ఆమె కళ్లు ఆశగా వెతికేశాయి.
ఒక చివర బల్లల మీద పోలీసులు, సంకెళ్లు వేసి ఉన్న ఖైదీలు కనుపించారు కంగారుగా పరుగులాంటి నడకతో ఆమె అటు వెళ్లింది. దగ్గరకు పూర్తిగా వెళ్లకముందే ఆ సంకెళ్ల ఖైదీల మధ్యలో తన భర్త….!
ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది…!
కాళ్లు వణుకుతున్నాయి…
భుజం మీద పసికందు ఎక్కడ నిద్రలేచిపోతుందో అని జాగ్రత్తగా అరచేతితో అదిమిపెడుతూ భర్తని సమీపించింది. పోలీసుల వంక భయం భయంగా చూసింది. కాని వాళ్లు భయపెట్టలేదు.
“ఏమ్మా!” అని అడిగారు.
నిశ్శబ్దంగా తన భర్తని చూపించింది. వాళ్లకి అర్థమయింది. “మాట్లాడుకోండమ్మా” అన్నారు పోలీసులు గౌరవంగా.
భర్తకి దగ్గరగా వెళ్లింది. గుండెలోతుల్లోంచి ఏడుపు తన్నుకొస్తుంటే, వెక్కి వెక్కి ఏడుస్తోంది. మాట్లాడుతున్న మాటలు గొంతు పెగిలి బయటకు రావటంలేదు. “ఎందుకేడుస్తున్నావ్?” నిబ్బరంగా కూర్చున్న భర్త అడిగాడు. భార్య తన భుజం మీద గుడ్డకప్పివున్న రోజుల పిల్లని చూపించింది. చూశాడు. చేతితో ప్రేమగా నిమిరాడు. ఆమె ఏడుపు ఆపలేదు. ఆ భర్త మళ్లీ అనునయంగా అడిగాడు. “ఎందుకేడుస్తున్నావ్?”
ఆమె అసంకల్పితంగా భర్త చేతికున్న సంకెళ్లు చూపించింది. కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.”ఎందుకేడుస్తున్నావ్?” ఆమె కన్నీళ్లు తుడుస్తూ కృష్ణమూర్తి అడిగాడు.
“మాట్లాడలేకపోయింది. కన్నీటిని ఆపేటంత శక్తి ఉన్న వయస్సు కాదు ఆమెది. “ఏడవకు… ఏడవద్దు..” భర్త గొంతు కొంచెం కటువుగా వినిపించింది లక్ష్మీనరసుకి. ఆయన వంక భయంభయంగా, బెరుగ్గా చూసింది.
“చూడు. ఇది ఒక పవిత్రమైన ఉద్యమం. దేశానికి బానిస సంకెళ్లు పోవడం కోసం ఈ సంకెళ్లు వేయించుకున్నాం. నాలాంటి వాళ్లు దేశంలో లక్షల్లో ఉన్నారు. ఆ ఏడుపు మాని గర్వపడు…”
భుక్తి కోసం ప్లీడరు గుమాస్తాగా పనిచేస్తున్న కృష్ణమూర్తి 1921లో గాంధీ ఏలూరు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు, ఆ ఆ ప్రసంగంతో ఉత్తేజితులయ్యారు. అంతే! చూపు కనబడని తల్లిని చూసుకోవటం కన్నా భరతమాతని బానిసత్వం నుంచి కాపాడటం ముఖ్యం అనుకున్నారు. తండ్రి అనుమతి అడగలేదు. పెళ్లయి వెళ్లిపోయిన సోదరికి చెప్పలేదు. అప్పటికప్పుడే ‘తిలక్ స్వరాజ్య ఉద్యమ నిధి’ కార్యక్రమంలో చురుగ్గా మమేకమైపోయారు. విదేశీవస్త్రాల్ని ఆ విసర్జించారు. ఖద్దరు కట్టడం ప్రారంభించారు. ఖద్దరు మూటలు మోసి, గ్రామాల్లో తిరిగి, వ్యాపారస్థుల చేత అమ్మించారు. విదేశీ వస్త్రాలు కట్టే వాళ్లని ఒప్పించి, ఖద్దరు కట్టించేలా ప్రచారం చేశారు. విదేశీ వస్త్రాల్ని దహనం చేయించారు.
27 ఏళ్ల వయసులో 1924లో పెళ్లయింది. భార్యకి మొదటి రోజే చెప్పారు. “దేశానికి స్వాతంత్య్రం రావటం కోసం, గాంధీజీ పిలుపుతో ఈ ఉద్యమంలో చేరాను. ఖద్దరే కట్టాలి. నేత చీరెలు కట్టడం అలవాటు చేసుకో….” అలా చెప్పి ఊరుకోలేదు. ఇక స్వయంగా రాట్నం కొని నూలు వడకటం ప్రారంభించారు. భార్యకి నేర్పారు. అలా వడికిన నూలుని ఖద్దరు కేంద్రంలో ఇచ్చి, ఆ బరువుకి పంచె, అంగవస్త్రాలు – తెచ్చుకునేవారు. భార్యకి చీరెలు తెచ్చేవారు. 1983లో చివరి శ్వాస విడిచే వరకూ ఖద్దరే వాడిన కార్యకర్త ఆయన.
అనేక సార్లు పికెటింగ్లు చేశారు… గరికిపాటి మల్లావధాని అనే మరో స్వాతంత్ర్య సమరయోధుడైన పండితుడితో కలిసి ‘ఢంకా’ అనే స్వాతంత్ర్యోద్యమ పత్రికని రహస్యంగా ముద్రించి, రహస్యంగా పంపిణీ చేసేవారు. ఉద్యమంలో పూర్తిగా మునిగిపోయిన కాలంలో అనేక సార్లు లాఠీ ఛార్జీల్లో తల పగలటం, కాళ్లు విరగటం, కముకు దెబ్బలతో కదల్లేకుండా పడిపోవటం వంటి ఘటనలు మామూలైపోయాయి.
రెండు సార్లు జైలుశిక్ష అనుభవించారు. జైల్లో ఖైదీలకిచ్చే ఉప్పుడు బియ్యం అన్నం, రాళ్లు కలిపిన సాంబారు భోజనం తిరస్కరించి ఉపవాసాలుండిపోయారు. ఆయన ఆరోగ్యం కోసం అధికారులు పాలు, రొట్టె ఇస్తుంటే, తన తోటి ‘సి’ క్లాసు ఖైదీలందరికీ పాలు, రొట్టె ఇవ్వాలని జైలు అధికారులతో గొడవపడటం, నిరశన వ్రతం చేయటం ఆయన అలవాటుగా మారిపోయింది.
సహాయనిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం కోసం కల్లు దుకాణాల ముందు పికెటింగ్, మట్లపాలెం ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, లోథియన్ కమిటీకి నిరసన ప్రదర్శనలు, ‘ఢంకా’ రహస్య పత్రిక నిర్వహణ, ‘సైమన్ గో బ్యాక్’ ప్రదర్శన, గాంధీ- ఇర్విన్ ఒప్పందం విఫలమైన నాటి నిరసన ప్రదర్శనలు, క్విట్ ఇండియా ప్రదర్శనల వరకూ ‘వందేమాతరం’ అని గర్జిస్తూ ఉద్యమంలోకి ఉరికి, దేశానికి విముక్తి ఒక్కటే లక్ష్యంగా, కుటుంబ సంక్షేమాన్ని సైతం వెనక్కి పెట్టి పోలీసు లాఠీ దెబ్బల్ని, జైలు గోడల మధ్య ‘సి’ క్లాసులో ఉపవాసాల జీవనాన్ని ఆనందంగా స్వీకరించి కూడా ప్రచారంలోకి రాని వేలాది సాధారణ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఈ గుండు వేంకట కృష్ణమూర్తి ఒకరు.





