News

సకల దేవతా స్వరూపిణి గోమాత

31views

భూలోకంలో సకల దేవతల స్వరూపిణి గోమాతే అని ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నంద్యాలలోని   స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో హైదరాబాద్‌ ధర్మవర్తిని ట్రస్టు, మన ఊరు–మనగుడి, మన బాధ్యత ఆధ్వర్యంలో గో ప్రాధాన్యత, గోసేవ ఆవశ్యకత, విశిష్టత గురించి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఆర్‌డీఓ విశ్వనాథ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారన్నారు. ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే గోమాత వద్దకు వెళ్లి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయట పడతారన్నారు. ఆవు గంగడోలు నిమిరినా పాపం నుంచి విముక్తి లభిస్తుందన్నారు. గోవును మనం చూసినా.. అది మనల్ని చూసినా పాపం తొలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు గోమాతకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకొని జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌రెడ్డి, రఘువీర్‌, హరికృష్ణ, వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.