
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందరికీ అన్నంపెట్టే వ్యవసాయ రంగంవైపు దృష్టిసారించే వారి సంఖ్య తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాడిపట్టి సాగు బాటలో పయనించే వారు అరుదుగా కనిపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ నూతిబంద గ్రామానికి చెందిన యువ రైతు రాజేష్ డిగ్రీ చదివి సేద్యాన్ని అభిరుచిగా మలచుకున్నారు. 1.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఏడాది పొడవునా 20 రకాలకుపైగా పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు.
రాజేష్‌కు వారసత్వంగా వచ్చిన 1.5 ఎకరాల భూమి ఉంది. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు రాకపోవడంతో వ్యవసాయం, వ్యాపారంపై దృష్టిసారించారు. ఒకవైపు సాగు చేస్తూనే వ్యాపారంపైనా దృష్టిసారించారు. కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం వంటి పంటలను రైతుల నుంచి కొనుగోలు చేస్తూ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రసాయన రహిత ఎరువులు, పురుగుమందులతో పండించిన ఉత్పత్తులకు గిరాకీ ఉండటంతో ప్రకృతి, సేంద్రియ విధానంలో పంటలు పండించాలని నిర్ణయించారు. వర్షాధారంగానే కాకుండా కొండలపై నుంచి వచ్చే ఊట నీటిని సద్వినియోగం చేసుకున్నారు. పొలానికి సమీపంలో సాగునీటి కోసం చెరువును తవ్వించారు. చెరువు నీటిని పొలాలకు మళ్లిస్తూ టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చిమిరప, బీట్‌రూట్, క్యారెట్, రాజ్‌మా, బీన్స్, అల్లం, తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, కరివేపాకు సాగు చేస్తున్నారు.
సాగునీటి కోసం తవ్వించిన చెరువులో చేపల పెంపకం చేపట్టారు. సమగ్ర వ్యవసాయ విధానాలు ఆచరిస్తూ ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం పొందుతున్నట్లు యువ రైతు రాజేష్ చెప్పారు. ఇటీవల రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బాబూరావునాయుడు, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజరు భాస్కర్ క్షేత్ర స్థాయిలో పంటల సాగు విధానాలను పరిశీలించారు. చదువుకున్న యువత వ్యవసాయ రంగంపైనా దృష్టిసారిస్తే రాణించవచ్చని, ఇందుకు యువ రైతు రాజేష్ నిదర్శనమని అభినందించారు.





