
325views
శ్రీశైలంలో వచ్చే ఏప్రిల్ 26న అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహిస్తుండటంతో ఆలయ అధికారులు, ఉద్యోగులు శుక్రవారం కొబ్బరికాయలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారం రోజున ఏ రోజు ముందు వస్తే ఆ రోజు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. కార్యక్రమంలో స్వామివారి ఆలయ ఏఈవో హరిదాసు, పర్యవేక్షకులు వెంకటేశ్వరరావు, అయ్యన్న, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.





