
శ్రీశైలం అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని, నిధుల దుర్వినియోగానికి కొంతమంది పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) వివరాలు సేకరిస్తోంది. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికైనా అవినీతిపరులెవరనేది తెలుస్తుందా..? లేదా..? అనే ఉత్కంఠ అందరిలో రేగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీశైల దేవస్థానంలో 2016 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జరిగిన పనుల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై పీసీ చట్టం 17ఏ కింద విచారణ చేపట్టాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం 2023 జులైలో విజయవాడ, కర్నూలుకు చెందిన అనిశా అధికారులు విచారణ చేపట్టారు. అనిశా సీఐ వంశీనాథ్, డీఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనిశా బృందం శ్రీశైలం వచ్చి రింగ్‌రోడ్డు(వలయమార్గం), పుష్కరిణి, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, ఆలయ మాడవీధుల అభివృద్ధి పనులను పరిశీలించారు. వాటికి సంబంధించిన రికార్డులు, కొలతల వివరాలు తీసుకున్నారు. ఆయా పనులకు సంబంధించిన రికార్డులతో పాటు అప్పట్లో పని చేసిన ఏఈ నుంచి ఈఈ స్థాయి వరకు విచారణకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సమయంలో కొందరు ఇంజినీర్లు ఇతర ఆలయాల నుంచి కూడా వచ్చి విచారణకు హాజరయ్యారు. ఒక ఏఈ విచారణకు సహకరించకపోవడంతో దేవస్థానం ఈవో దృష్టికి అనిశా అధికారులు తీసుకెళ్లడంతో ఆయన కూడా అన్ని రికార్డులు చూపించారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు పలుమార్లు శ్రీశైలంలో పర్యటించారు.





