
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు, ఈ కాకరపర్రు గ్రామంపై ఎంతో పరిశోధన చేసి రాశారు. పురాణ కాలంలో కాకరపర్రు దండకారణ్య ప్రాంతమనీ, రామాయణం లోని కాకాసుర వృత్తాంతం జరిగిన ప్రదేశం ఇదేనని పౌరాణికులు గట్టిగా నమ్ముతారు. అదేమిటో చూద్దాం. రామాయణంలోని సుందరకాండలో సీతాదేవి హనుమంతు నికి చెప్పిన ఒక ఆసక్తికరమైన కథే ఈ కాకాసుర వృత్తాంతము. చిత్రకూటంలో శ్రీరాముడు, సీతాదేవి విహరిస్తూ ఉండగా, ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతామాతను హింసిస్తాడు కోపంతో రాముడు ఆ కాకిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, శరణు కోరిన కాకి ప్రాణాలను రాముడే రక్షిస్తాడు. అయితే ఆ అస్త్రం వ్యర్థం కాకూడదు కాబట్టి రాముడు ఆ అస్త్రాన్ని కాకి ఒక కన్ను తీసి వేసేలాగా ఆదేశించి కాకాసురుని ప్రాణాలను కాపాడుతాడు. అగ్ని పురాణం దీనిని పాతాళ నృసింహ క్షేత్రమనీ, ఈ వశిష్ట గోదావరి తీరాన బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడని చెబుతుంది.
చారిత్రకంగా చూస్తే కాకరపర్రు ప్రాచీన కాలంలో (9-11 శతాబ్దకాలంలో) ‘‘పానార విషయము’’ (వేంగి మండలంలోని తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరు తాలూకాతో కొల్లేటి వరకూ ఉన్న ప్రాంతం) ఇది తరువాత ‘‘అత్తిలి నాణ్డు’’లో అంతర్భాగమైంది. నేడు పెరవలి మండలంలో ఉంది. నిడదవోలు నియోజకవర్గం, మెకన్జీ కైఫియత్ ప్రకారం నిడదవోలు చాలా ప్రాచీన నగరమనీ, ఈ నియోజక వర్గంలో పెరవలి త్రేతాయుగంలోనే ఆవిర్భవించిందని పెర అనగా సంస్కృతంలో చితి కాగా వాలిని దహనపరిచిన ప్రాంతమని పెర+వాలి = పెర్వాలి, కాలక్రమంలో పెరవలిగా మారిందని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం.
చరిత్రలోనికి వెళితే సంస్కృతంలో ఈ గ్రామం కారవల్లిగా పేరు గాంచిందని, ఇది ఒక అనధికార సంస్కృత విశ్వవిద్యాలయంగా పేరొందిందని కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారు రాశారు. ఇక్కడి స్త్రీ, పురుషులు శబ్దమంజరి, అమరకోశం, పంచ కావ్యాలను తప్పనిసరిగా అభ్యసించేవారు, గ్రామంలోని వీధి అరుగులే పాఠశాలలుగా, సంస్కృత అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. కాకరపర్రులో పుట్టిన చిగురు కొమ్మ అయిన చేవ అన్నట్లు ఈ గడ్డ మీద గడ్డి పరక కూడా కవిత్వం చెపుతుందని నానుడి.
రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం యేటిగట్టు నుండి కాకరపర్రుకు గోదావరి తీరం ఒడ్డు వరకూ ఏనుగుపై వచ్చి గోదావరిని దాటి రాజరాజు ఈ గ్రామానికి వచ్చి రాజరాజ నరేంద్రుని పేరు మీద శివప్రతిష్ఠ చేశారు. ఏనుగులను అక్కడే ఉన్న రావిచెట్టుకు కట్టి శివదర్శనం చేసుకొనేవారట. ఏనుగులు కట్టిన రావిచెట్టు ప్రాంతాన్ని ఏనుగల రావి అని పిలుస్తారు. అది ఇప్పటికీ ఉంది.
రాజమండ్రి నుండి మద్వ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణులు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో స్థిరపడటంతో ఈ ప్రాంతం మురారి దొడ్డిగా ప్రాచుర్యం చెందింది. వల్లభాచార్యులు జన్మించింది ఈ మురారి దొడ్డిలోనేనని వేదుల వెంకట్రావు స్పష్టం చేశారు.
ఈ గ్రామానికి ప్రారంభంలో ఉండే నుయ్యి పేరు పెరుకు నుయ్యి. కాకరపర్రుకు ఎవరు వచ్చినా ఈ నూతి నీళ్లు తాగి గ్రామంలో ప్రవేశించేవారు. అయితే దానిని ఇప్పుడు పూడ్చేశారు. నేటికీ కాకరపర్రులో అనేక పురాతన మేడలు ఉన్నాయి. వేదుల సూర్యనారాయణ శర్మ ఆ నూతి నీళ్ల గురించి ‘‘కొబ్బరి నీటికి సాటి నూతులు నున/నీరు త్రాగియే నూరేండ్ల సువులు నిలుపవచ్చునండి’’ అని రాశారు.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగా ‘‘కాకరపర్రు శతాబ్దాల నుండి ఒక విద్యాపీఠం’’ అని అన్నారు. ఆచార్య ఎస్.వి.జోగారావు ‘‘భారతీయ సాంప్రదాయ విద్యలకు దక్షిణ కాశీ కాకరపర్రు’’ అంటూ అభివర్ణించారు. వేదుల సూర్యనారాయణ శర్మ కన్నీళ్లు అనే తన కావ్యంలో మా గ్రామమంటే కాశీకే కన్నెర్రండీ’’ అంటూ రాశారు. జర్మనీకి చెందిన పండితుడు మాక్స్‌ముల్లర్ కాకరపర్రు గ్రామంలోని ప్రతీ అరుగు ఒక విశ్వవిద్యాలయమే అని రాశారు అని అంటారు. (మాక్స్ ముల్లర్ ఇండియాకు రాలేదు. బహుశా ఈ గ్రామం గురించి విని అలా రాసి ఉంటారు). చారిత్రక బ్రహ్మ మల్లంపల్లి సోమశేఖర శర్మ ‘‘ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము’’లో విష్ణుకుండిన రాజులలోని 3వ మాధవవర్మ ఉత్తమ న్యాయ పాలకుడు. వైధిక ధర్మ రక్షకుడుగాను పేరొందాడు. చారిత్రక ఆధారాలు లేనప్పటికీ ఈ రాజు కాకరపర్రులో వైదిక క్రతువు నిర్వహించి ఉండవచ్చు అని రాశారు. త్రిమూర్తులు ప్రతిరూపంగా మూడు చెట్ల పండుగ ఇక్కడ నిర్వహిస్తారు. కాకరపర్రులోని వశిష్ట. గోదావరీతీరాన లంక భూముల్లో రావి, వేప, మర్రిచెట్లు ఏకమై కొలువు దీరి ఉండటంతో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుని ప్రతిరూపాలుగా యేటా కార్తిక మాసం, మాఘమాస పర్వదినాల్లో ఈ మూడు చెట్ల పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
మహా రచయిత, కవి శ్రీపాద కృష్ణశాస్త్రికి ఎదురైన అరుదైన అనుభవం గురించి రాశారు. తన 10వ ఏట వీరిని కాకరపర్రు అరుగు మీద కూర్చున్న పండితుడొకరు ‘‘ఏ వూరు వెళుతున్నావు బాబు’’ అని అడిగారట. అప్పుడు ఈయన ముక్కామల వెళుతున్నాను అని చెప్పారట. ‘‘ఏమి చదువుకున్నావు బాబు’’ అని అడిగారట. అప్పుడు ఈయన ‘‘నాకు చదువు రాదు’’ అని చెప్పారట. ఆ మాట విన్న పండితుడు ‘‘నీకు కాకరపర్రులో అడుగు పెట్టే అధికారం లేదు’’ అన్నారట. ఈ విషయాన్ని శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు. ఆనాడు కాకరపర్రులో చదువులేని వారు లేరు అని అనడంలో అతిశయోక్తి లేదు. తిరుపతి వేంకట కవులు కాకరపర్రుకు వచ్చారు. అక్కడ జరిగిన పండిత గోష్ఠిలో ఆకుండి వేంకట లింగ శాస్త్రిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అప్పుడు వేంకట రామకృష్ణ కవులలోని వేదుల రామకృష్ణశాస్త్రి తిరుపతి వేంకట కవులకు ఘాటుగానే స్పందించారట. తిరుపతి వేంకట కవులలోని వేంకట కవికి మీసము ఉండేదట. ఆయన తమని ఎవరైనా సంస్క ృతంలో ఓడిస్తే ఒక వైపు మీసము, తెలుగులో ఓడిస్తే మరోవైపు మీసము తీసివేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాని పండిత గోష్ఠిలో రామకృష్ణశాస్త్రి సాహిత్యం ముందు తిరుపతి వేంకట కవులు ‘‘వెల వెల’’ పోయారుట. వెంటనే తాము చేసిన ప్రతిజ్ఞకు కాకరపర్రు మినహాయింపు అన్నారట. ప్రాచీన విద్యాపీఠంగా ఈ గ్రామం అలరారిందని చెప్పే కథ ఒకటి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. ఉద్దండ భారతీ స్వాములనే యతీశ్వరుడుండే వాడు. ఆయన కాశీలో సకల శాస్త్రాలను ఆమూ లాగ్రం అభ్యసించానన్న గర్వంతో ఎక్కడి కెళ్లినా శాస్త్ర చర్చలో గెలిచాకే భిక్ష తీసుకునేవాడు. ఆయన ఎప్పుడూ ఒక బంగారు చేట, ఇదిగో ఇలా చేటతో చెరిగేస్తా, ఆ తరువాత చీపురుతో ఊడ్చి పారేస్తానని బీరాలు పోయేవాడట. అలా కాకరపర్రు చేరగా స్వాములవారు కాకరపర్రు పండితుల వైదుష్యానికి ఎంతగానో విస్మయం చెంది, చిట్టచివరకు తాను ఓడినట్లు అంగీకరించి ‘‘ఆశ్చర్య మాశ్చర్యం (కవిత్వాన ఎవరికైనా ప్రశ్న వుంటుందా) మతః పరం కీమ్ అనే సమస్యను వారికి ఇచ్చారట. ఒక యువ కవి దానిని పూరించాడట.
క్రీ।।శ।। 10-11వ శతాబ్దాల మధ్యకాలంలో అనిసింగరాజు శాస్త్రి, యవ్వనప్రాయంలో ఉండగా సాంప్రదాయ భారతీయ విద్యలు నేర్చుకోవాలనే తలంపుతో కాలినడకన వెళుతుండగా కాశీ క్షేత్రము నకు ముందు గ్రామంలో ఓ పర్ణశాల కన్పించింది. అక్కడున్న దాని యజమానిని ఆ రాత్రికి అక్కడ ఉండటానికి వసతి కావాలని కోరగా అంగీకరించాడు యజమాని. కాశీ రావడానికి గల కారణాన్ని వాకబు చేయగా తాను సాంప్రదాయ విద్యలు నేర్చుకోవాలనే తలంపుతో వచ్చానని చెప్పాడు. వ్యాకరణం నేర్చుకోవా లంటే నేనే చెప్పగలను. కానీ నాకు పగలు కుదరదు రాత్రి మాత్రమే చెప్పగలనని చెప్పాడు. అనిసింగరాజు శాస్త్రి పట్టుదలతో 12 సంవత్సరాలు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాక కాశీ సభలో జరిగిన పరీక్షకు వెళ్లారు. అయితే కృష్ణశాస్త్రి వాదన పటిమకు ముగ్దులై మీ గురువు గారు ఎవరు అని అడిగారట, వెంటనే తన గురువుగారి పేరు చెప్పగా ఆయన మహా పండితుడేగాని చనిపోయి చాలాకాలమైంది బహుశ ఆయన ఏ బ్రహ్మరాక్షసిగానో నీకు చదువు చెపుతున్నా రేమోనని హేళన చేశారట. తన గురువు బ్రహ్మ రాక్షసుడా? కలవాలా వద్దా అని సందిగ్ధంలో పడి అయినా గురువును మించిన దైవం లేడని తనకుతానే సముదాయించుకుని గురువువద్దకు వెళ్లి అడగ్గా అవును తాను బ్రహ్మరాక్షసుడనేనని తను జీవించినంత కాలము తనకు వచ్చిన విద్యను ఎవరికీ నేర్పక పోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందనీ, ఎవరికైనా ఒక విద్యార్థికి చదువు చెబితే ఈ శాపం పోతుందని చెప్పి అతనికి విద్య నేర్పాడట. ఆ తరువాత ఆయన తిరిగి కాకరపర్రు చేరి ఎందరో విద్యార్థులను పండితులుగా తయారు చేశాడని ఈ కథను విశ్లేషిస్తే ఆది కవి నన్నయ్యభట్టు అనిసింగ రాజు వద్దనే వ్యాకరణం అధ్యయనం చేసి ఉంటారని, భారతాంధ్రీకరణకు ముందే నన్నయ్యభట్టు వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని రాసి ఉంటారని తెలుస్తున్నది. ఈ గ్రామంలోని పండితుల్లో అధికభాగం వ్యాకరణ పండితులే. చరిత్ర గర్భంలో అనిసింగరాజు కృష్ణశాస్త్రి కలిసిపోయారని పండితుల అభిప్రాయం.
నారాయణభట్టు సంస్కృత, ప్రాకృత, కర్ణాట, పైశాచికాంధ్ర భాషలలో కవిత్వం చెప్పగల నేర్పరి అని, నారాయణ భట్టు తమకు నివాస యోగ్యమైన, అనుకూలమైన తణుకు తూర్పున పండితాగ్రహార గ్రామమైన కాకరపర్రు చేరాడని అక్కడే నివాసమున్నాడని, ఆయనకు అభిమాన పాత్రుడైన నన్నయ్యభట్టు అనంతరకాలంలో ఈ గ్రామం చేరి ఉంటాడని ఈ గ్రంథ రచయిత కానూరి బదరీనాథ్ అభిప్రాయపడ్డారు.
‘‘హంపీ విరూపాక్ష జగద్గురు పీఠం’’ నుండి శ్రీ పుష్పగిరి, శ్రీ అభినవ విరూపాక్ష జగద్గురు పీఠములు ఏర్పడ్డాయి. శ్రీ అభినవ విరూపాక్ష పీఠం, మొట్టమొదట కాకరపర్రులోనే స్థాపితమైంది. దానికానాడు కాకరపర్తి పీఠమని వాడుకలో ఉండేది. నరసింహా దేవర వేంకటశాస్త్రి (1828-1915) వీరు అభినవ దండి బిరుదాంకితుడు. వీరు విచిత్ర రామాయణం వాల్మీకి మొదటి రచన అనీ, అది అదృశ్యమవ్వడం వల్ల వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని రచించి లవకుశుల ద్వారా గానం చేయించారనీ ఈ కావ్యం వలన మనకు తెలుస్తుంది.
పురాణం పండ మల్లయ్యశాస్త్రి (1853-1925) శుక్ర నీతిసారమును ఆంధ్రీకరించారు. పెద తాడేపల్లి వారి జన్మ స్థలం. కాని కాకరపర్రు, ఖండవల్లి నివాసగ్రామాలు. వీరు కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం మేనమామ. అలాగే ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి (1860-1916) ఆశు కవితా చక్రవర్తి కాకరపర్తి వేంకట శాస్త్రి (1874-1964), పుంభావ సరస్వతి చర్ల బాష్యకార శాస్త్రి (1878-1949) అల్లంరాజు త్రయం. డా।। అల్లంరాజు గాయత్రీదేవి, వేదుల సూర్యనారాయణ శాస్త్రి, సరస్వతీ గ్రంథ మాల సంపాదకులు కాకరపర్తి సత్యనారాయణ మూర్తి, పురాణపండ గౌరీపతి శాస్త్రి, వేదుల రామశాస్త్రి, చర్ల నారాయణ శాస్త్రి, పిఠాపురం సంస్థాన కవులు ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణ, పెనుమత్స సత్యనారాయణరాజు, చర్ల గణపతిశాస్త్రి, వీరంతా సారస్వత సరస్వతికి ఆభరణాలు.
నేడు కాకరపర్రు యువకులు వివిధ కళాశాలల్లో పట్టభద్రులై, పలు రంగాలలో ఉద్యోగస్తులై, ఇతర పట్టణాలలో స్థిరపడి సెలవులకు మాత్రం కాకరపర్రు చేరేవారు. వారు గ్రామంలో ఉన్నంత కాలం పాటలు పాడుతూ వీధులు శుభ్రపరిచేవారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ వంటిదే. శుభ్రపరుస్తూ ఈ పాట పాడేవారు.
‘‘వీధి తుడవండోయ్ బాబూ, వీధి తుడవండోయ్
వీధులలోనే వేనకు వేలు వ్యాధులు పుట్టి తాండవ
మాడును. వీధి తుడవండోయ్ బాబూ’’
తుడుపు అయిన తరువాత గోదావరి చేరుకుని స్నానం చేసి, తిరిగి వస్తూ సుబ్రమణ్యస్వామి, శివాలయాలను దర్శించుకొని ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. కాకరపర్రులో నాడు సాహిత్య గుబాళింపు అయితే నేడు పూల పరిమళాలతో ఆనందభరితంగా ఉంది.
మూలం:
‘‘తరతరాల సరస్వతీ పీఠం’-మన కాకరపఱ్ఱు’’ – కానూరి బదరీనాథ్ రాశారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు





