News

పురిటిగడ్డలో పురాతన పోతురాజుస్వామి విగ్రహం

236views

కృష్ణా జిల్లా పురిటిగడ్డలోని శ్రీపోతురాజు స్వామి విగ్రహం అత్యంత పురాతనమైన విగ్రహంగా పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి నిర్ధారించారు. జీర్ణోద్ధరణకు చేరుకున్న ఆలయ స్థానంలో నూతన దేవాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు విగ్రహాన్ని శుభ్రంగా కడిగి విగ్రహంపై సంవత్సరం ఉందేమోనని చూడగా విగ్రహానికి ఓవైపు ప్రాచీన లిపి చెక్కినట్లుగా కనిపించింది.

చరిత్రకారులకు తెలియజేయాలని భావించినప్పటికీ ఆలయ పనుల్లో నిమగ్నమయ్యారు కమిటీ పెద్దలు. పురిటిగడ్డ జూనియర్‌ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ ఓలేటి ఉమా సరస్వతి శుక్రవారం ఆలయ ప్రాంగణానికి రావటంతో లిపి విషయాన్ని ఆమెకు తెలిపారు. విగ్రహాన్ని, లిపిని పరిశీలించిన ఉమా సరస్వతి విగ్రహ ప్రాచీనత, ప్రాశస్థ్యం తెలియాలంటే పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డికి తెలియచేయాలని చెప్పి ఫొటోలు తీసి ఆయనకు పంపినట్లు ఆలయ కమిటీ పెద్దలు నాదెళ్ల శివరామకృష్ణ తెలిపారు.

ఫొటోలు చూసిన ఈమని శివనాగిరెడ్డి విగ్రహం మూడో శతాబ్ధం నాటి విగ్రహమని తెలియచేశారనీ, ఫొటోలను ఆర్కియాలజీ శాఖకు పంపినట్లు సమాచారమిచ్చారని శివరామకృష్ణ వివరించారు. పురిటిగడ్డకు రావాల్సిందిగా విగ్రహ చరిత్రను మరింతగా తెలియచేయాలని కోరనున్నట్లు తెలిపారు. విగ్రహం ఏడడుగుల ఎత్తులో ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. ఈనెల 30న ప్రతిష్ఠా మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు శివరామకృష్ణ తెలిపారు.