
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ వేదికలు కాదని వ్యాఖ్యానించింది. ‘ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం. సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామ’ని స్పష్టం చేసింది. విరాళాల చోరీపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారా? అని సీజేఐ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని, 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారని మెహతా వివరించారు. దర్యాప్తులో తేలిన విషయాలను కోర్టుకు తెలియజేయాలంటూ కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 27కి వాయిదా వేసింది.





