ArticlesNews

కలియుగ రావణుడు

33views

సనాతన ధర్మాన్ని ఆచరించే వారు హిందూ పురాణాల్లో రాక్షస రాజైన రావణుడి వ్యక్తిత్వాన్ని గురించి చెడుగా చెప్పుకుంటారు. ఆయన లక్షణాలు ఎవరికీ ఉండకూడదని కోరుకుంటారు. అయితే కలియుగం వైపరీత్యంతో కొంతమంది ఆయన పేరు చెప్పుకొని అవే అవలక్షణాలతో విర్రవీగుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు ‘ఉపా’చట్టం కింద అరెస్టు చేసిన ప్రశ్న రావణ్ గురించి చెప్పుకుంటే, రామాయణంలోని రాక్షసుడు రావణుడే కొంచెం నయమే అనిపించేలా ఆధునిక రావణుడు వ్యవహరిస్తున్నాడు. అహంకారం, కామం, క్రూరత్వం, మూర్ఖత్వం వంటి రాక్షస ప్రవృత్తులతో దశ కంఠుడైన రావణుడి లక్షణాలను మించిపోయి, ఒక కంఠమే ఉన్నా లోక కంటకుడిగా మారిన నేటి ప్రశ్న రావణుడు సమాజానికి చీడపురుగుగా తయారయ్యాడు. సనాతన ధర్మం వినాశనమే లక్ష్యంగా భావస్వేచ్ఛ పేరుతో బరితెగిస్తున్న ప్రశ్న రావణ్‌తో పాటు ఇలాంటి వారికి భావప్రకటన స్వేచ్ఛ పేరిట మద్దతుగా నిలుస్తున్న వారి కుట్రలపై కూడా హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది.

ప్రశ్నించడం మా హక్కంటూ ‘ప్రశ్న’ యూట్యూబ్ వేదికగా ఈ కలియుగ రావణుడు జర్నలిస్టు ముసుగులో అరాచకాలు చేస్తున్నాడు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతో ఉండే ఈ యÖట్యూబ్ వేదికగా రావణ్ ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు రగిలిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను కించపరుస్తూ రావణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పలు ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగింది. మేధావులు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రోడ్ల మీదకొచ్చారు. ప్రధానంగా పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో జనసేనపార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పిఠాపురంలో నమోదైన కేసు ఆధారంగా రావణ్‌ను అరెస్టు చేశారు. రాజకీయాల నేపథ్యంలోనే రావణ్‌ను అరెస్టు చేసినట్టు పైకి కనిపిస్తున్నా దీనిపై లోతైన విశ్లేషణ చేస్తే భయంకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. రాజకీయ నేతలపై వ్యాఖ్యలు చేస్తే కఠినమైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేస్తారా? అన్ని ప్రశ్నించే వారికి ‘ప్రశ్న రావణ’ కొంతకాలంగా చేస్తున్న వివాదస్పదమైన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు, దూషణల వెనుక భారీ కుట్ర ఉందనే సత్యం తెలుస్తుంది. అందుకే వారు ఇప్పుడు ప్రశ్నించే హక్కు లేదా? అంటూ రావణ్‌ను సమర్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు.

రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను, భావ ప్రకటన హక్కును అడ్డం పెట్టుకొని రావణ్ సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యానించడం, సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ ప్రసారాలు చేయడం తరచూ జరుగుతోంది. పవన్‌కల్యాణ్ సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించి నప్పటినుంచి ఆయన హిందూ వ్యతిరేకులకు లక్ష్యంగా మారారు. ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షపార్టీ వైఎసఆర్‌సీపీ ప్రశ్నించే గొంతుకను అణచివేస్తున్నారంటూ రావణ్‌కు వత్తాసు పలుకుతోంది. రాజకీయ ప్రత్యర్థులుగా పార్టీలు లబ్ది పొందేందుకు ప్రయత్నించవచ్చు. అయితే సనాతన ధర్మాన్ని ఆచరించే మెజార్టీ ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలి. తమ రాజకీయ పబ్బం కోసం ఏమైనా మాట్లాడవచ్చు అనేలా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రశ్న రావణ్ వంటి అరాచక శక్తులతో దేశ సమగ్రత దెబ్బతినడమే కాకుండా వారు ప్రమాదకరంగా మారుతున్నారనే సత్యాన్ని గ్రహించాలి.

సమాజంలో సంస్కరణల కోసం గొంతెత్తు తున్నట్టు కపట నాటకాలతో ఈ అభినవ రావణుడు సనాతన ధర్మాన్ని హేళన చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఆయన అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్ అంటేనే అర్థం అవుతోంది ఈయన క్రైస్తవ మతస్తుడని. అయితే తాను క్రిస్టియన్, దళితుడిని కాదని, ఒక సంస్కరణవాదినని, హేతువాదినని చెప్పుకునే ఈ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యూహాత్మకంగా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, పురాణాలను దూషిస్తూ, జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. హిందూ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను బూతులు తిడుతున్నాడు. హిందువులు రాక్షసుడిగా భావించే రావణుడి పేరు పెట్టుకొని తార్కికంగా సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నట్టు గెటప్ ఇస్తూ, ప్రశ్న రావణ్ పేరుతో హడావుడి చేస్తున్నాడు. ఈయన హేతువాదే అయితే కేవలం సనాతన ధర్మాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటు న్నాడు? తాను ఏ మతానికి చెందని వాడినని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న రావణ్ వాక్ స్వాతంత్య్రం పేరుతో కేవలం హిందూమతం గురించే మాట్లాడుతాడు. ఇతర మతాల పేరు కూడా ఎత్తని ఈ హేతువాదికి ఉన్న ధైర్యం కేవలం సనాతన ధర్మం ఆచరించే వారి సహనమే. హిందువులను, హిందూ దేవతలను, పురాణాలను హేళన చేసినా, దూషించినా ఎవరూ స్పందించరనే ధైర్యంతో ఒంటెత్తుపోకడలతో కారుకూతలు కూస్తున్నాడు. రాముడిని, సీతని, రామాయణాన్ని, కృష్ణుడిని, ద్రౌపదిని, మహా భారతాన్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఏమి తోస్తే అది మాట్లాడుతూ సనాతనధర్మాన్ని దూషిస్తున్నాడు.

ఒక సామాన్య యÖట్యూబర్‌గా ఉన్న కలియుగ రావణుడు ఇంతగా బరితెగించడానికి వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేయగానే, కుహనా సెక్యులరిస్టులు, మేధావులు, వామపక్షవాదులు, నాస్తికులు, హేతువాదులతో పాటు కొన్ని రాజకీయపార్టీల నేతలు కూడా ఒక్కటయ్యారు. వీరికి కొందరు సినీ ప్రముఖులు కూడా తోడయ్యారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తారా? అని అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని దూషిస్తూ మెజార్టీ ప్రజల మనోభావాలను కించపరచడం లౌకికవాదం ఎలా అవుతుందో ఈ ప్రశ్నించే గొంతుకులకే తెలియాలి. ఉపా చట్టం కింద రావణ్‌ను అరెస్టు చేయగానే కొద్దిమంది సినీ ప్రముఖులు మాట్లాడిన ఆడియో రికార్డులు ప్రజల మధ్య మరింత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. సమాజాన్ని ఉద్ధరించే మనిషిలా రావణ్‌ను చిత్రీకరిస్తున్న ఈ సంస్కరణ వాదులు ఆయన చేసిన అరాచకాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర వెనుక ఈ అభినవ రావణ్ ఒక్కడే లేదు. దీని వెనుక రాజకీయం ఉంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో విభేదించే వారు అక్కసుతో వ్యూహాత్మకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. హేతు వాదులుగా ప్రకటించుకునే కొందరితో సభలు ఏర్పాటు చేయించి హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావణ్‌ను అరెస్టు చేసిన కేసు కూడా ఇలాంటి సందర్భమే. ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరిట నిర్వహించిన ఒక సభలో రావణ్ రాజకీయ నేతలను దూషించాడని, రెచ్చగొట్టేలా మాట్లాడాడని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో నాలుగుసార్లు అరెస్టయ్యాడు. గతంలో పలుమార్లు సోషల్ మీడియాలో ఇంతకంటే జుగుప్సాకరంగా సనాతన ధర్మాన్ని హేళన చేశారు. అప్పుడు ప్రభుత్వాలు, పోలీసులు కూడా స్పందించలేదు. ఆలస్యమైనా రాజకీయ నేతలను దూషించాడని రావణ్‌ను అరెస్టు చేయడంతో ఆయన భాగోతాలు బయటపడు తున్నాయి. అతను గతంలో చేసిన వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపి శిక్షించాలి.

సెక్యులర్ దేశంలో క్రిస్టియన్లు, ముస్లింలను దూషించిన వారిపై కేసులు పెట్టరు కానీ, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం కేసులు పెడుతున్నారనే కొత్త వాదనని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని గతంలో బీజేపీ నేత నుపూర్ శర్మని, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసినా ఈ మేధావులు తెలియనట్టే నటించారు. ఎవరు ఏ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించినా శిక్షిం చాల్సిందే. వారు ఏ రాజకీయ పార్టీకి చెందినా, ఎంతటి ప్రముఖులైనా వదిలిపెట్టకూడదని ప్రజలు కోరుకుంటారు.

తెలుగునాట రావణ్ ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే కలకత్తా హైకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. రామకృష్ణ మిషన్ కళాశాలలో తమల్ దాస్‌గుప్తా అనే వ్యక్తి నియామకానికి సంబంధించి కోర్టు తీర్పు మేధావులకు చెంపపెట్టు. తమల్ దాస్ గుప్తా గతంలో సామాజిక మాధ్యమాల్లో రామకృష్ణ మిషన్‌కు, ఆ సంస్థ సాధువులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రామకృష్ణ కళాశాలలో ఉద్యోగ నియామానికి అర్హత సాధించారు. తమ సంస్థపట్ల వ్యతిరేక భావాలున్న ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి రామకృష్ణ మిషన్ అంగీకరించలేదు. దీంతో సదరు వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ… “ప్రతి వ్యక్తికీ తనకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అయితే. దీనిని ఇతరుల విశ్వాసాలను గాయపర్చడానికి ఇచ్చిన అనుమతిగా భావిsచ రాదు…” అని పేర్కొంటూ తమల్ దాస్‌గుప్తా ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసింది. ఇది కేవలం ఒక నియామకాన్ని రద్దు చేయడం కాదు, వాక్ స్వాతంత్య్రం పేరిట ప్రశ్నించే హక్కు నెపంతో ఇతర మతాలను, వారి విశ్వాసాలను దూషించడం, కించపర్చడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న కోర్టు తీర్పుతో మేధావులు కళ్లు తెరవాలి. ఏదైమైనా, ఏపీలో రావణ్ అరెస్టు, కలకత్తా తీర్పు రెండింటి మధ్య కొంత సారూప్యత ఉంది. ఈ రెండు ఉదంతాలతో సనాతన ధర్మం ఆచరించేవారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా అవాకులు చెవాకులు పేలేవారికి ఒక హెచ్చరికగా కూడా ఉంది.

రాజకీయంగా దూషిస్తే దేశద్రోహం పేరిట కఠినమైన ఉపా చట్టం కేసు నమోదు చేయడం అన్యాయమని వాదిస్తున్న మేధావులు, ఉద్దేశ పూర్వకంగా వాస్తవాలను తక్కువ చేసి చూపిస్తున్నారు. నిషిద్ద భావాలకు బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ బాసటగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మావో సిద్ధాంతాలను వ్యాప్తిచేస్తూ, సాయుధ తిరుగుబాటును ప్రోత్సాహిస్తూ, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు ప్రసారం చేశారంటూ యÖట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన కేసుల నేపథ్యంలో ఈయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కేసు నమోదు చేశారు. ఒకవైపు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, మరోవైపు నిషద్ధభావాల సిద్ధాంతాలకు బాసటగా నిలవడం వంటి కార్యక్రమాలకు పాల్పడిన ప్రశ్న రావణ్ అరెస్టును ప్రశ్నిస్తూ ఆయనకు కొందరు మద్దతుగా ఉండడం దురదృష్టకరం.

‘ప్రశ్న’ పేరుతో యÖట్యూబ్ నిర్వహించినా, తన పేరుకు ప్రశ్నను తగిలించుకున్నా రావణ్ మేధావి కాదు, సంస్కరణవాది కాదు. సనాతనధర్మాన్ని కించపరచడమే లక్ష్యంగా పేర్లతో జిమ్మిక్కులు చేసే ఇలాంటి సంఘ విద్రోహులను, ఇలాంటి వారికి మద్దతుగా నిలుస్తున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆనన్నమైంది. ఏమి మాట్లాడినా చెల్లుతుంది. ఏమి చేసినా పట్టించుకోరు అనే ధోరణితో సాగే శక్తులపై సరైన సమయంలో చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

 – శ్రీపాద