News

పుట్టపర్తి జిల్లాలో వెయ్యేళ్ల నాటి చోళుల తమిళ శాసనం వెలుగులోకి

25views

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో చోళరాజుల కాలానికి చెందిన అరుదైన తమిళ శాసనం వెలుగులోకి వచ్చింది. బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లికి సమీపంలోని ప్రాచీన అక్కమహాదేవతల ఆలయం వద్ద ఈ శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు.

క్రీ.శ. 1042లో చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు ఈ శాసనాన్ని చెక్కించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో బుక్కపట్నం ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందించేందుకు ‘ముదిగొండ చోళ పేరేరు’ పేరుతో ఒక చెరువును తవ్వించినట్లు పేర్కొన్నట్లు వెల్లడించారు.

ఈ శాసనం ద్వారా బుక్కపట్నం ప్రాంతం చోళ రాజుల పాలనలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లభించాయని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, విశ్రాంత కలెక్టర్ విశ్వనాథ్ తెలిపారు. ఈ శాసనం ప్రాంత చరిత్ర పరిశోధనకు కీలక ఆధారంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.