
ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి బలిజ కళ్యాణ మండపం వరకు నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖా మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలరాముడు, శ్రీ సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ సంప్రదాయబద్ధంగా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, జండా ఊపి శ్రీ జగన్నాథ రథయాత్రకు ఘనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగుతూ భక్తి భావాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… “ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ధర్మవరంలో శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయం. శ్రీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని జగన్నాథ స్వామిని ప్రార్థిస్తున్నాను.” అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగా వర్షపాతం అస్థిరంగా ఉండే పరిస్థితులు ఏర్పడి, సాగునీరు, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని విస్తరించడంతో పాటు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సేవలందిస్తున్న ఇస్కాన్ సంస్థ నిర్వాహకులకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ధర్మవరంలో ఇస్కాన్ సేవలు విశేషం 2013 సంవత్సరం నుంచి ధర్మవరం ఇస్కాన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భగవద్గీత ప్రచారం, భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోంది. 2018 నుంచి జగన్నాథ–బలదేవ–సుభద్ర విగ్రహాల ప్రతిష్ఠతో నిత్యపూజలు నిర్వహిస్తోంది. 2023 నుంచి ధర్మవరంలో స్థలాన్ని శంకుస్థాపన చేసి శాశ్వత ఆలయ నిర్మాణ దిశగా అడుగులు వేస్తుండగా, 2026 నాటికి ఈ రథయాత్ర ఐదో ఏడాదిలోకి ప్రవేశించడం విశేషం. ప్రస్తుతం ఆలయ ఇన్‌చార్జిగా శ్రీకృష్ణ మాధవదాస్ సేవలందిస్తున్నారు.
ఈ మహోత్సవంలో ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం భక్తిరసంతో, హరినామ సంకీర్తనలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగింది.





