News

గోదావరి యాసకు జీవంపోసిన పసలపూడి కథలు

374views

గోదావరి జిల్లాల్లో జీవన విధానం, మాండలిక భాషా సౌందర్యాన్ని వంశీ కథల ద్వారా ప్రపంచానికి చక్కగా వివరించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం కె.రామచంద్రారెడ్డి రచించిన వంశీ మా పసలపూడి కథల కమామిషు పుస్తక పరిచయ సభకు జె.కృష్ణబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి విచ్చేసి వంశీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మా పసలపూడి కథల్లో గోదావరి జిల్లాల్లో మాట్లాడే యాస, మానవీయ విలువలు సమర్థంగా ఉన్నాయని చెప్పారు. కవి, చరిత్ర పరిశోధకుడు ర్యాలి ప్రసాద్‌ మాట్లాడుతూ గోదావరి జిల్లాల మాండలిక భాషా సౌందర్యాన్ని, రామచంద్రారెడ్డి పరిశోధనలో వివరాలు వెల్లడించాయన్నారు. కవి.రచయిత అద్దేపల్లి ప్రభు, సాహితీవేత్త ప్రకాశరావు మాట్లాడుతూ వంశీ కథలకు రామచంద్రారెడ్డి పరిశోధన మరింత వన్నె తెచ్చిందన్నారు. పుస్తక ప్రచురణకర్త సానా వెంకట్రావు తనకు రామచంద్రారెడ్డితో ఉన్న స్నేహాన్ని వివరించారు. అనంతరం రామచంద్రారెడ్డిని పలువురు సత్కరించారు. కార్యక్రమంలో కొండూరు రామరాజు, మార్ని జానకీరామ్‌చౌదరి, గొడవర్తి సత్యమూర్తి, కె.గౌరినాయుడు, సూర్యభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.