
కూచిపూడి, సంప్రదాయ నృత్యాలతో తమదైన గుర్తింపు తెచ్చుకున్న గాజువాక ప్రాంత బాలికలు.. ఇటీవల రాష్ట్రస్థాయిలో వరుస ప్రదర్శనలు ఇస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచి 16 ఏళ్లలోపు ఉన్న వారంతా బృందాలుగా వీడి సత్తా చాటుతున్నారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే వస్త్రధారణకు కళాకారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. గాజువాక కళారాధన మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులు గత రెండు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వరకు ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆధ్యాత్మిక ఆనందం
బాలికలు చిన్నతనం నుంచి చదువుతో పాటు కూచిపూడి కళలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలకు అనుగుణంగా నృత్యాలతో మెప్పిస్తున్నారు. ధనుర్మాసోత్సవాలు, మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని రోజూ ఏదో ఒక ఆలయంలోనో, ఇతర ప్రాంతాల్లోనో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. నాట్యాచార్యుడు తాళ్లపాక సందీప్‌కుమార్ నేతృత్వంలో 22 మంది బాలలు కూచిపూడి, సంప్రదాయ నృత్యాలు, రింగ్ డ్యాన్స్‌లతో అలరిస్తున్నారు.

రాష్ట్ర దేవాదాయశాఖ పిలుపు మేరకు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, సింహాచలం నృసింహస్వామి, విశాఖ కనకమహాలక్ష్మి తదితర ఆలయాలతో పాటు ప్రసిద్ధ శిర్డీ క్షేత్రంలోనూ నృత్య వేడుకలతో అలరించారు. దేవతామూర్తుల వేషధారణలతో స్వామికి నృత్యాభిషేకం చేస్తూ… పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు.
జాతీయస్థాయిలో..
ఆలయ కమిటీలు, ధార్మిక సంస్థల నుంచి అనేక పతకాలు సొంతం చేసుకున్న చిన్నారులో త్వరలోనే జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇవ్వనున్నారని నాట్యాచార్యుడు సందీప్‌కుమార్ తెలిపారు. వారణాసి, అయోధ్య, హైదరాబాద్‌లో ప్రదర్శనలకు ఆహ్వానాలు అందాయని, ఆ మేరకు కళాకారులు సాధనపై ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు.
రథసప్తమి సందర్భంగా తిరుపతి గోవిందస్వామి ఆలయంలో హంస వాహన సేవలు, తిరుమల మాడ వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల విశాఖలో శ్రీరాజ మాతాంగేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశ్యామలానంద నాద ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంస్కృతిక వేడుకలోనూ భళా అనిపించారు. అలాగే తమిళనాడు చిదంబరం నటరాజస్వామి మందిరంలో నృత్యార్చనలో పాలు పంచుకున్నారు. అమరావతిలోని ఇస్కాన్ గోకులక్షేత్రం, శ్రీకృష్ణ దేవస్థానంలో నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.