
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. నల్లమలలోని నడకదారిలో సాగిపోయే వారికి పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల వారు ఏటా సేవలు అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి భక్తుల ఆకలి తీరుస్తున్నారు. ప్రయాగలో లక్ష మందికి, కాశిలో కోటి మందికి అన్నదానం చేస్తే వచ్చే పుణ్యం శ్రీశైల మహాక్షేత్రంలో ఒక్కరి కడుపు నింపినా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఏటా అన్నదానం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మార్చి 2 నుంచి మల్లన్న సన్నిధిలో శివరాత్రి వేడుకలు మొదలు కానున్న నేపథ్యంలో కాలిబాటలో పాదయాత్రికుల సందడి మొదలైంది. దీంతో ఈనెల 28 నుంచి నల్లమలలో అన్నదానం చేసేందుకు దాతలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
రాజుల కాలం నుంచే మొదలు
అప్పట్లో రాజుల కాలం నుంచే నల్లమలలో అన్నదాన శిబిరాలు నిర్వహించేవారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వెంకటాపురం, నాగలూటి వీరభద్ర క్షేత్రాల్లో అన్నదానం చేసేవారు. రెండు మూడేళ్లుగా శ్రీపతిరావుపేట మలుపు, కృష్ణాపురం, నల్లకాల్వ గ్రామాల్లోనూ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ముఖద్వారం నాగలూటి క్షేత్రంలో..
శ్రీశైల ముఖద్వారమైన నాగలూటి క్షేత్రంలో ఉన్న ద్వారపాలకుడు వీరభద్రుడి సన్నిధానంలో పెద్దదేవలాపురం గ్రామస్థులు 29 ఏళ్లుగా అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. బాలశంకర్‌రెడ్డి మిత్రులు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కరోనాతో ఆయన మృతి చెందడంతో ఆయన కుమారులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చివరి గ్రామం వెంకటాపురంలో..
శ్రీశైల క్షేత్రానికి వెళ్లే నడక మార్గంలో చివరగా వచ్చే గ్రామం వెంకటాపురం. ఇక్కడి నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలోనే ఇక్కడ అన్నదాన శిబిరాలు నిర్వహించారు. గత 27 ఏళ్లుగా శ్రీమల్లేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రోజూ వేలాది మందికి భోజనాలు వడ్డిస్తున్నారు.
ఎస్సార్బీసీ కాలనీలో..
ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని ఎస్సార్బీసీ కాలనీలో 1988 నుంచి భక్తులకు ఆహారం అందిస్తున్నారు. కాలనీకి చెందిన బూసిరెడ్డి, వరలక్ష్మి, రామకృష్ణయ్య, రఘునాథరెడ్డి, నాగన్న, నాగేంద్ర, నాగిరెడ్డి మరికొందరు సత్యసాయి సేవా సమితి పేరుతో అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. కన్నడిగులు సైతం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు.
పెచ్చెర్వు గూడెంలో..
నల్లమల అరణ్యంలోని పెచ్చెర్వు గూడెంలో గూడూరు వీరభద్రస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 29 ఏళ్ల నుంచి భక్తులకు భోజనాలు వడ్డిస్తున్నారు. కర్నూలు ద్వారకా స్థిరాస్తి, ఫ్రెండ్స్ అసోసియేషన్, నందికొట్కూరు భక్త బృందాల ఆధ్వర్యంలో గ్రామస్థులు కొన్నేళ్లుగా అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
భీముని కొలనులోనూ..
నడకదారిలోని భీముని కొలను ప్రాంతంలోని కొండ మార్గంలో ఎత్తైన రాళ్లు ఎక్కి దిగడం చాలాకష్టం. ఈ ప్రాంతానికి నడిచి వెళ్లడమే ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. ఇలాంటి చోటికి కొందరు భక్తులు వంట సామగ్రి మోసుకెళ్లి భోజనాలు వండి భక్తులకు వడ్డిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.





