News

మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా?

35views

మరఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కానుంది. ఇజ్రాయెల్‌లో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యూదులు శతాబ్దాలుగా హింసను ఎదుర్కొన్నప్పటికీ భారత్‌లో మాత్రం వారు ఎలాంటి వివక్ష లేకుండా సురక్షితంగా జీవించారనే చారిత్రక బంధానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

కొంకణ్ తీర ప్రాంతంలో నివసించే ‘బెనె ఇజ్రాయెల్’ అనే యూదు సమాజానికి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య 17వ శతాబ్దం నుంచే బలమైన సైనిక బంధం ఉంది. యూదుల యుద్ధ నైపుణ్యాలను, వారి పట్టుదలను గుర్తించిన శివాజీ మహారాజ్.. వారిని తన సైన్యంలో, నౌకాదళంలో కీలక పదవుల్లో నియమించారు. మరాఠా నావికాదళంలో ‘ఆరోన్ చురికర్’ అనే యూదు సైనికుడు నేవీ కమాండర్‌గా సేవలందించి శివాజీ మహారాజ్ చేతుల మీదుగా ఇనామ్ భూములను కూడా పొందడం విశేషం.

ఈ యూదులు మహారాష్ట్ర సంస్కృతిని, మరాఠీ భాషను ఎంతగానో ఆదరించారు. శనివారాల్లో తమ మత ఆచారం ప్రకారం చమురు మిల్లుల పనికి సెలవు ప్రకటించడం వల్ల స్థానికులు వీరిని ‘శనివార్ తేలీలు’ అని పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో ఈ బెనె ఇజ్రాయెల్ సైనికులు ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబే ఆర్మీలోనూ చేరి.. ఆంగ్లో-మైసూర్, ఆంగ్లో-మరాఠా యుద్ధాల్లో తమ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించి చరిత్ర పుటల్లో నిలిచారు.

1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత భారత్‌ నుంచి వేలాది యూదు కుటుంబాలు అక్కడికి వలస వెళ్లాయి. ప్రస్తుతం అక్కడ దాదాపు 50,000 మందికి పైగా బెనె ఇజ్రాయెల్ వంశస్థులు నివసిస్తూ.. అక్కడ కూడా మరాఠీ వంటకాలను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. భారత్‌లో తమకు లభించిన గౌరవానికి కృతజ్ఞతగా, ఇజ్రాయెల్ గడ్డపై వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇరు దేశాల ప్రాచీన మైత్రికి ఒక సజీవ సాక్ష్యంగా నిలవనుంది.