
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్‌లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు చెల్లించి పిండి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..
టార్గెట్ 10 లక్షలు.. కొన్నది కేవలం 8 శాతమే!
సింధ్ ప్రాంతంలో ఈ సీజన్‌లో 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూన్ 4 నాటికి ఆహార శాఖ కేవలం 79,835.66 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 8 శాతం కూడా పూర్తి కాలేదన్నమాట. రైతుల నుంచి ప్రభుత్వం గోధుమలు సేకరించలేకపోవడానికి గల కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) లో వ్యాపారులు రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. దాంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా, నేరుగా ప్రైవేట్ వ్యాపారులకే తమ పంటను అమ్ముకున్నారు. ప్రభుత్వం 40 కిలోల గోధుమలకు 3,500 పాకిస్థానీ రూపాయల మద్దతు ధరను ప్రకటించి, సుమారు 3.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్లాన్ చేసింది. కానీ మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది.





