ArticlesNews

పురుగులను చంపకుండా పట్టు తయారీ- సిల్క్‌తో పూరీ జగన్నాథుడికి వస్త్రాలు- ఎలాగో తెలుసా?

28views

ఈ జగత్తుకు అధిపతి పూరీ జగన్నాథుడని హిందువులు భావిస్తారు. సమస్త జీవరాశుల ప్రాణాలు ఆయన చేతిలోనే ఉంటాయని నమ్ముతారు. అయితే జగన్నాథ స్వామి విగ్రహాన్ని రకరకాల వస్త్రాలతో అలంకరిస్తారు. వాటిలో కరుణ సిల్క్‌తో చేసినవి చాలా ప్రముఖమైనవి. ఈ క్రమంలో కరుణ సిల్క్ అంటే ఏంటి? ఈ పట్టు దేనితో తయారవుతుంది? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.

కరుణ సిల్స్ అంటే ఏమిటి?
ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథుడికి గత రెండేళ్లుగా కరుణ సిల్క్‌తో చేసిన వస్త్రాలతోనే అలంకరిస్తున్నారు. అహింసాత్మక పద్ధతిలో తయారుచేసే పట్టును కరుణ సిల్క్ అంటారు. సాధారణ సిల్క్ తయారీలో 10,000 పట్టు గూళ్లను ఉడకబెట్టడం ద్వారా పట్టును తీస్తారు. ఈ ప్రక్రియలో పట్టు పురుగులు సైతం చనిపోతాయి. కానీ కరుణ సిల్క్ తయారీలో మాత్రం పురుగులను చంపకుండా, అవి పరిపక్వమై సీతాకోకచిలుకల్లాగా ఎగిరిపోయేలా చేస్తారు. ఆ తర్వాత మిగిలిన దారాన్నే కరుణ సిల్క్ అంటారు. దీంతోనే పూరీలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రకు వస్త్రాలను తయారు చేస్తున్నారు.

’30 ఏళ్లుగా స్వామికిసేవ చేస్తున్నా’
గత రెండేళ్లుగా మహాప్రభువు కోసం ‘గీతా గోవింద ఖండువా’ చీరతో సహా వివిధ వస్త్రాల తయారీలో కరుణ సిల్క్‌ను ఉపయోగిస్తున్నామని కుర్దాకు చెందిన చేనేత కార్మికుడు రమేశ్ దాస్ తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా స్వామివారికి సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. గతంలో పట్టు గూళ్లను ఉడకబెట్టి సిల్క్‌ను తయారు చేసేవారని చెప్పారు. కరుణ సిల్క్ వల్ల పట్టు పురుగులకు ఎలాంటి హాని జరగదని వెల్లడించారు. అలాగే ఈ కరుణ సిల్క్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ, ఇది మానవతాపూర్వకమైనదని స్పష్టం చేశారు. తాను మొదట ఓధన్ షష్ఠి వస్త్రాల తయారీ చేశానని అన్నారు. ఆ తర్వాత గీతా గోవింద, దశావతార వంటి వస్త్రాలను రూపొందించానని వివరించారు. పూరీ జగన్నాథుడికి సేవ చేసే అవకాశం లభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

సేంద్రీయమైన ఉత్పత్తి కూడా
సాధారణ పట్టు ఉత్పత్తిలో లక్షలాది పురుగులు పట్టుగూడులోనే ఉండగా ఉడకబెడతారు. అయితే కరుణ సిల్క్‌లో పురుగులు సీతాకోకచిలుకల్లాగా మారేంత వరకు జీవించడానికి అనుమతిస్తారు. ఇది జీవుల పట్ల దయ, జీవ వైవిధ్య పరిరక్షణ సందేశాన్ని అందిస్తుంది. సంప్రదాయ సిల్క్ ఉత్పత్తికి పట్టుగూళ్లను అధిక మొత్తంలో వేడి నీటిలో ఉడకబెట్టడం అవసరం. దీనికి ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కరుణ సిల్క్‌కు తయారీకి తక్కువ ఇంధనం సరిపోతుంది. అలాగే ఇది పూర్తిగా సేంద్రీయమైనది కూడా.

ఒడిశాలోని చాలా మంది కరుణ సిల్క్ ఉత్పత్తిదారులు సహజమైన, సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు. ఈ పట్టు తయారీకి తక్కువ రసాయనాలను వాడుతారు. తద్వారా నేల, నీరు, పర్యావరణంపై రసాయనాల ప్రభావం తగ్గుతుంది. కరుణ సిల్క్ పూర్తిగా సహజమైన నారలతో తయారవుతుంది. ఇది ప్లాస్టిక్ ఆధారిత సింథటిక్ వస్త్రాల్లా సంవత్సరాల తరబడి పర్యావరణంలో ఉండిపోదు. కాలక్రమేణా ఇది సహజంగానే మట్టిలో కలిసిపోతుంది. కరుణ సిల్క్‌తో తయారుచేసిన వస్త్రాల మన్నిక కూడా ఎక్కువే.

వస్త్రాలను నేయడంలో నిమగ్నమైన 25 కుటుంబాలు!
ఖుర్దా జిల్లాలోని రౌతపడ గ్రామంలోని సుమారు 20- 25 కుటుంబాలు గత కొన్నేళ్లుగా పూరీ జగన్నాథుడి కోసం వస్త్రాలను నేయడంలో నిమగ్నమై ఉన్నాయి. 1992 నుంచి ఈ గ్రామస్థులు జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రలకు అవసరమైన వస్త్రాలను ఆలయానికి సమర్పిస్తున్నాయి. ఈ ప్రధాన ఆలయంలో స్వామివారికి సమర్పించే వస్త్రాల్లో బరా హాతి గడ, సేల హాతి గడ, బోయిరాని, నేటె ఫుట, నేటె ఖండువా, గాడిపేట, మల్మల్, శ్రీముఖోట, తనఖోస, అధరగముఛ్ఛ, నియుచలి గముఛ్ఛ, సుత ఫుట, నర్హి, శ్రీఅంగ పోష వంటివి ఉన్నాయి. వారంలోని ఏడు రోజులూ దేవుళ్లను

వేర్వేరు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు.
తాము గత 30-35 ఏళ్లుగా మహాప్రభువుకు సేవ చేస్తున్నామని చేనేత కార్మికుడు గోవింద చంద్రదాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా పూరీ రథయాత్ర కోసం ఆలయ యంత్రాంగం జనవరి నెల నుంచే తమకు వస్త్రాల తయారీకి అనుమతులు ఇస్తుందన్నారు. స్నాన పూర్ణిమ లోపే ఆ పనులను తాము పూర్తి చేసి అధికార యంత్రాంగానికి వస్త్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. తమ కష్టానికి తగ్గ డబ్బులు రాకపోయినప్పటికీ, మహాప్రభువుకు సేవ చేసే భాగ్యం లభించినందుకు సంతోషిస్తున్నామన్నారు.